
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అసలే రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వీరిది. ఇంటికి పెద్ద దిక్కు అయినా తన భర్త నెల రోజులకు పైగా కనిపించకుండా పోవడంతో కంటిమీద కునుకు లేకుండా ఎప్పుడు వస్తాడోనని, ఏమి వినాల్సి వస్తుందోనని ఆందోళనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది ఈ అభాగ్యురాలు. వివరాలలోకి వెళితే..! హుజురాబాద్ పట్టణంలోని కుమ్మరివాడకు చెందిన మోతే రమ్య (28) తన భర్త మోతే రఘుపతి (33) గత నెల మూడున సెంట్రింగ్ పని వెతుకుంటానని ఇంట్లో చెప్పి సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి తన తమ్ముడి వాహనాన్ని తీసుకొని వెళ్ళాడు. రాత్రి వరకు రాకపోవడంతో ఆందోళన చెందిన ఆ కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా అంతట వెతికారు అతని ఆచూకీ లభించలేదు. మరునాడు అదే రాయికల్ గ్రామ చెరువుకట్ట వద్ద మోతే రఘుపతి తీసుకుపోయిన ద్విచక్ర వాహనం కనపడింది కానీ వ్యక్తి కనిపించలేదు. ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు బంధువులు, తెలిసిన మిత్రుల వద్ద ఎంత వెతికిన అతని ఆచూకీ లభించలేదు. దీంతో ఐదో తారీఖు నాడు సైదాపూర్ పోలీస్ స్టేషన్లో మోతె రఘుపతి కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైదాపూర్ పోలీసులు విచారణ జరుగుతుండగా నాటి నుండి నేటి వరకు రఘుపతి ఆచూకీ లభించకపోవడంతో రోజురోజుకు అతని భార్య మోతే రమ్య, అతని కుమారులు వరుణ్ తేజ్ (6) రిషిక్ (4) తీవ్ర బెంగ పెట్టుకొని ఆందోళన చెందుతున్నారు. అయితే రఘుపతి అప్పుడప్పుడు చలి తీవ్రతకు మతిస్థిమితం తప్పి దారి తప్పుతాడని ఆ విధంగా దారితప్పి వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గత కొన్ని రోజుల క్రితం చిగురుమామిడి మండలం సుందరగిరిలో కనిపించాడని, మరో రెండు రోజుల తర్వాత రేకొండ గ్రామంలో కనిపించాడని స్థానికులు వీరి బంధువులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సమాచారం మేరకు ఆయా ప్రాంతాలల్లో వెతికినప్పటికీ రఘుపతి ఆచూకీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అతడు వెళ్లేటప్పుడు బ్లూ కలర్ షర్టు, నైట్ ప్యాంటు ధరించాడని.. 5.7 సెంటీ మీటర్లు హైటు(ఎత్తు), చామనచయ కలర్ లో రఘుపతి ఉంటాడన్నారు. ఇంట్లో నుండి వెళ్లే ముందు 10 రోజుల క్రితం గుండు చేయించుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మంచం పట్టిన తండ్రి, వృద్ధురాలైన తల్లి, చిన్నపిల్లలు కలిగిన అతని భార్య రమ్య రఘుపతి పై ఆధారపడి ఉన్నారు. ఎవరైనా గుర్తించినట్లయితే స్థానిక సైదాపూర్ పోలీసులకు గాని, తమ కుటుంబ సభ్యులకు గానీ సమాచారం ఇవ్వాలని మోతే రమ్య వేడుకున్నారు. కుటుంబానికి పెద్దదిక్కు అయినా మోతే రఘుపతి కనిపించకుండా పోవడంతో ప్రతిరోజు అతని కోసం కన్నీరు మునీరుగా భార్యా, పిల్లలతో పాటు తల్లిదండ్రులు, అన్నదమ్ములు రోదిస్తూ ఆవేదన, ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా రఘుపతిని గుర్తించినట్లయితే తమకు అప్పగిస్తే తగిన ప్రోత్సాహం అందిస్తామని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.








