మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్,
ఆగష్టు 24:-కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో చిన్నపాటి వర్షానికి పలువురి ఇల్లులు నీట మునుగుతున్న స్థానిక గ్రామపంచాయతీ అధికారులు గానీ మండల స్థాయి అధికారులు కానీ పట్టించుకోక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో వర్షం నీరు గ్రామం మొత్తం నుంచి వంపులో ఉన్న గ్రామానికి చెందిన తుమ్మనపల్లి లచ్చమ్మ ఇల్లు వరద నీటిలో మునిగిపోతుంది. లచ్చమ్మ ఇల్లు కిందికని ఉండడంతో గోడలు మొత్తం నాని ఎప్పుడు ఏ అనర్ధం సంభవిస్తుందోనని భయం భయంగా జీవిస్తుంది. గ్రామానికి చెందిన 20 మంది ఇండ్లు వరదనీటిలో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని ఏళ్లుగా గ్రామ శివారు నుండి వచ్చే వరద నీరు లచ్చమ్మ ఇంటి మీదుగా వంగల వేమారెడ్డి ఇంటి పక్కనుండి వంగల వెంకటరెడ్డి ఇంటి మీదుగా కళ్లెపు సత్యనారాయణరావు భూమి నుండి ఓర్రెలో కలిసి పోలాల గుండా చెరువులో పడుతుంది. అయితే ఇటీవల కల్లేపు సత్యనారాయణరావు వర్షం నీరు వెళ్లకుండా తన భూమిలో మొరం అడ్డుగా పోసి వరద నీటిని అడ్డుకోవడంతో వర్షం నీరు పలువురి ఇండ్ల ఎదుట నీరు నిలువ అయ్యి పలువురి ఇండ్లు నీటిలో మునిగిపోతూ కూలేందుకు సిద్ధంగా మారాయి. వరద నీరు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని సత్యనారాయణరావుపై స్థానిక పోలీస్ స్టేషన్లో పలువురు రాతపూర్వకంగా రెండు రోజుల క్రితం ఫిర్యాదు కూడా చేశారు. అయితే పోలీసులు ఇది సివిల్ మ్యాటర్ కావడంతో రెవెన్యూ అధికారులను కలవాలని సలహా ఇచ్చి వదిలించుకున్నారు. దీంతో బాధితులు రెవెన్యూ అధికారులను కలువగా వారు చూసి చూడనట్లుగానే వ్యవహరించారు. ఇప్పటికైనా అధికారులు వరద నీరు వెళ్లేలా చర్యలు తీసుకోకపోతే సుమారు 20 మంది ఇండ్లు నీట మునిగి కూలిపోయే ప్రమాదం ఉందని తుమ్మనపల్లి లచ్చమ్మ, వంగల వేమారెడ్డి, పిన్ రెడ్డి కనుకారెడ్డి, వంగల వెంకట్ రెడ్డి తదితరులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, గ్రామపంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి వర్షం నీరు వెళ్లేలా సమస్యను పరిష్కరించాలని బాధితులు వేడుకుంటున్నారు.