
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజూరాబాద్: రానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలలో పర్యావరణ హితమైన మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ…హిందువులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి వేడుకలను పర్యావరణానికి హానికరమైన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కాకుండా మట్టితో చేసిన గణపతులను పూజించాలని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారీస్ తో చేసిన విగ్రహాల వలన నీటిలో ఉండే చాలా రకాల ప్రాణులకు హాని కలుగుతుందని, కాబట్టి మట్టితో చేసిన వినాయకులను పూజించి నీటిలో నిమజ్జనం చేయాలని కోరారు. ఈ వినాయక చవితి ఉత్సవాలను అందరం పర్యావరణ హితంగా జరుపుకోవాలని, సనాతన ధర్మంలో ప్రకృతిని పూజించే సంస్కృతి మనదని అన్నారు. కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగే పద్దతులను పక్కన పెట్టి, పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యతమివ్వాలి కోరారు. భవిష్యత్ తరాలకు స్వచ్చమైన గాలి, నీరు, వాతావరణం అందాలంటే ఉత్సవ సమితి నిర్వాహకులు, ఇండ్లలో పర్యావరణ హితమైన మట్టి వినాయకుడిని పూజించి, వినాయక చవితి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలన్నారు. సహజసిద్ధంగా లభించే బంకమట్టితో చేసే విగ్రహాలు త్వరగా నీటిలో కరిగిపోతాయని, మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసినా నీటి వనరులకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. మండపాలలో కూడా పర్యావరణ హితమైన మట్టి వినాయకులను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన అన్నారు.






