
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్ సెప్టెంబర్ 14: కరీంనగర్ లో సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం నాడు జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్బంగా జరిగే శోభయాత్ర రూట్ లు నిమజ్జన కేంద్రాలైన మానకొండూరు చెరువు, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్ ల వద్ద, ముఖ్య పట్టణాలలోని నిమజ్జన కార్యక్రమాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తుతోపాటు, పోలీసుపరంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా గణేష్ శోభాయాత్రలో డీజేల వినియోగంతో పాటు బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించామన్నారు. అదేవిధంగా నిమజ్జనం కొరకు నిర్వహించే శోభాయాత్రలో పాల్గొనే భక్తులు ఎటువంటి ఆయుధాల ప్రదర్శన, ఇతరులను గాయపరిచే వస్తువులు కలిగివుండరాదని, విద్వేష పూరిత నినాదాలు, ప్రసంగాలు చేయడం లేదా పాటల వినియోగం వంటి చర్యలకు పాల్పడరాదని తెలిపారు. ఇట్టి నియమాలు ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలంతా భక్తి శ్రద్దలతో, మతసామారస్యాన్ని కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో నిమ్మజ్జన కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించారు.






