
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: సీపీయం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణ వార్త తెలుసుకున్న ఎమ్మార్పీయస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఢిల్లీ చేరుకొని శనివారం న్యూ ఢిల్లీలోని ఏకేజీ భవన్ లో సీతారాం ఏచూరి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ పీడిత ప్రజల సంక్షేమం కోసం జీవితాన్ని వెచ్చించి దేశ రాజకీయాల్లో వామపక్ష నేతగా అత్యంత కీలక పాత్ర పోషించిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణించడం అత్యంత బాధాకరమైన విషయం అన్నారు. ఆయన మృతి పీడిత ప్రజలందరికి తీరని లోటును మిగుల్చుతుందన్నారు. వామపక్ష భావజాలంతో విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి దేశాన్ని ప్రభావితం చేసే నాయకుడిగా నిలిచారు. మేధావిగా, ఆర్థికవేత్తగా, వక్తగా, రాజకీయ విశ్లేషకుడిగా, రాజ్యసభ సభ్యుడిగా నిరంతరం పేద ప్రజల పక్షం వహించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమానికి మొదటి నుండి ఏచూరి మద్దతు తెలుపడమే కాకుండా డిల్లీ కేంద్రంగా జాతీయ స్థాయిలో ఎమ్మార్పీఎస్ కు ఎంతో సహకరించారు.రాజకీయ కార్యకలాపాలతో బిజీ షెడ్యుల్ ఉన్నప్పటికీ ఆయన కలవడానికి వెళ్లిన ప్రతి సందర్బంలో ఎంతో సమయం వెచ్చించి ఎస్సీ వర్గీకరణ కోసం అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆగష్టు 1 వ తేదీన సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణను సానుకూలంగా ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ మాదిగ ప్రజల పక్షాన తన నిబద్ధతను మరొకసారి చాటుకున్నారు. ఎస్సీ వర్గీకరణకై మాదిగలు చేసిన పోరాటం ఫలవంతం కావడానికి ఏచూరి గారు అందించిన సహకారం మరువలేనిది.ఎస్సీ వర్గీకరణ పోరాటం అత్యంత కీలక దశకు చేరుకున్న సందర్భంగా తెలుగు వారైన ఏచూరి, సురవరం ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు జాతీయ ప్రధాన కార్యదర్శిలుగా ఉండడం ఉద్యమానికి మరింత బలం చేకూరిందన్నారు. ఒకనాడు ఏక కాలంలో తెలుగు వారైన పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించి పేద ప్రజల పక్షాన ఎలా నిలిచారో మళ్ళీ తెలుగు వారైన ఏచూరి, సురవరం అలాగే ప్రజల పక్షాన నిలిచి జాతీయ రాజకీయాల్లో తెలుగు ప్రజల గౌరవం మరింత పెంచారన్నారు. వామపక్ష నేతగా జాతీయ రాజకీయాల్లో పీడిత, తాడిత ప్రజల గొంతుక నిలబడిన ఏచూరికి యావత్ మాదిగ జాతీ ప్రజల పక్షాన ఎమ్మార్పీఎస్ ఘన నివాళులు తెలుపుతున్నదని అన్నారు.








