
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ సెప్టెంబర్ 14 : ఇటీవల జరిగిన పరిణామాల అనంతరం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదివారం మాజీ ముఖ్యమంత్రి బిఆర్ ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ను ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కలిశారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ తదితరులు కూడా ఉన్నారు. ఇటీవల హైకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించిన నేపథ్యంలో.. కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సంబంధిత ఎమ్మెల్యేలను స్పీకర్ నిర్ణయానికి ముందే హైకోర్టు తీర్పును గౌరవిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం, తదనంతరం శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులను అరెస్టు చేసి కేశంపేటకు తరలించడం, పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు ఆందోళన చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తదనంతరం అమెరికా నుండి వచ్చిన కేటీఆర్ కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కౌశిక్ రెడ్డి కేటీఆర్ తో కలిసి గులాబీ బాస్ కేసీఆర్ ను కలవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చ నియాంశమైంది.
పార్టీ అండగా ఉంటుంది.. దీటుగా పోరాడు.. : కెసిఆర్ ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తనను కలిసిన కౌశిక్ తో కెసిఆర్ కొద్దిసేపు ముఖ్య విషయాలు మాట్లాడినట్టు తెలుస్తోంది. అధికార పార్టీ వైఫల్యాలను, కుట్రలను ప్రశ్నించే బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగానే సీఎం, పార్టీ మారిన ఎమ్మెల్యేల ప్రోద్భలంతోనే నీ ఇంటి పై దాడి జరిగింది.. ఇలాంటి దాడులకు.. భయపడొద్దు.. ఇలాంటివి ఉద్యమ సమయంలో ఎన్నో చూసాం.. అలా భయపడితే తెలంగాణ వచ్చేదా..? అని కెసిఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో, బయట గట్టిగానే నీ వాయిస్ ను వినిపించాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోరాడాలి.. పార్టీ నీకు ఎల్లవేళలా అండగా ఉంటుంది.. అని కెసిఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. నిన్ను ఒక సంఘ విద్రోహ శక్తిగా ముద్ర వేసి.. దుష్ప్రచారం చేసి.. నిన్ను అదుపు చేయాలని చూస్తున్నారు.. దీని వెనక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉంది.. నువ్వు అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించడంతోపాటు.. ప్రభుత్వాన్ని నిలదీయడం కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే నిన్ను టార్గెట్ చేశారు. హైదరాబాద్ ఇమేజ్ ను డామేజ్ చేసి ఆ నెపాన్ని బిఆర్ఎస్ పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. హైదరాబాద్‌ను గత పది ఏళ్లలో ఎంత ప్రశాంతంగా ఉంచామో.. అన్ని రంగాల్లో ఎంత అభివృద్ధి చేశామో.. ప్రపంచానికి తెలుసు.. ఇలాంటి జిమ్మిక్కులను ప్రజలు నమ్మబోరు.. హైదరాబాద్ ప్రజలు మనతోనే ఉన్నారు.. అని కెసిఆర్ చెప్పినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సంకట స్థితిలో ఉన్నాయి.. కచ్చితంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే.. ఈ విషయంలో ఇరుకున పడ్డామనే బాధతోనే వాళ్లు నీపై దాడి చేశారు.. అని ఆయన అన్నట్టు తెలిసింది. పాలనలో.. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. దీని నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. లేనిపోని విషయాలు తెరమీదకి తీసుకువస్తోంది.. ప్రజలు కాంగ్రెస్ నైజాన్ని, మోసాన్ని గమనించారు.. నీకు పార్టీ అండగా ఉంటుంది.. దీటుగా పోరాడు.. అని గులాబీ అధినేత చెప్పినట్టు సమాచారం. ఇలాంటి ఆరోపణలు వస్తుంటాయి పోతుంటాయి.. ఇది ప్రతిపక్షాలకు కుట్ర.. కావాలనే చేస్తున్న దుష్ప్రచారం.. దీన్ని దీటుగా ఎదుర్కోవాలి.. పార్టీ శ్రేణులను ముందుకు తీసుకువెళ్లాలి.. బి అర్ ఎస్ పార్టీని లేకుండా చేయాలనే అధికారపక్ష కుట్రలను తీపి కొట్టాలి.. అని ఆయన చెప్పినట్టు తెలిసింది. నీ ఇంటిపై దాడి చేస్తే పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన వచ్చింది.. గులాబీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేశాయి. ఎక్కడికక్కడ నాయకులను అరెస్టులు చేశారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. ప్రభుత్వ మోసాలను ఎండగట్టాలి. యావత్తు పార్టీ శ్రేణులకు అండగా ఉంటాను అని కెసిఆర్ తెలిపినట్టు తెలిసింది.







