–తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పనిచేయడం లేదు
–ముఖ్యమంత్రిపై 307 సెక్షన్ బుక్ చేయాలి
–ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు రేవంత్ రెడ్డి గుండెల్లో నిద్రపోతా
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీతో పాటు గుండాలను పంపించి, తనను హత్య చేయడానికి కుట్ర పన్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం హైదరాబాదులోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను ప్రజల తరపున, బీఆర్ఎస్ పార్టీ పక్షాన గట్టిగా నిలదీస్తున్నానని, ఆ క్రోధంతోనే తనపై ముఖ్యమంత్రి హత్యకు కుట్ర పన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రితో పాటు మంత్రుల మాటలకు పొంతన లేకుండా ఉందని, మంత్రి శ్రీధర్ బాబు “ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే మాకేంటి” అన్నారు అని పేర్కొన్నారు. అదే సమయంలో భట్టి విక్రమార్క “ఇద్దరు కొట్టుకొని హైదరాబాద్ పరువు తీస్తున్నారు” అన్నారు అని, కానీ ముఖ్యమంత్రి మాత్రం “కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళమని నేనే చెప్పాన”ని అన్నారని, దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేస్తుందా అనే అనుమానం తలెత్తుతోందని, ముఖ్యమంత్రి స్వయంగా తనపై హత్యకు కుట్ర పన్నినప్పుడు, రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందో తెలియడం లేదని కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఈ విషయంపై కేసీఆర్ మరియు కేటీఆర్‌తో చర్చించి గవర్నర్‌ను కలవనున్నామని తెలిపారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిజిపి ని డిమాండ్ చేశారు. అలాగే, గాంధీని తనపై దాడి చేయించడానికి వచ్చినప్పుడు, అదనపు డీసీపీ, ఏసీపీ, సీఐలు గాంధీకి ఎస్కార్ట్‌గా వచ్చారని, అయినప్పటికీ సైబరాబాద్ సీపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, రాబోయే రోజుల్లో తనపై ఏదైనా దాడి జరిగితే, పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదేనని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.