–రాబోయే స్థానిక ఎన్నికల్లో వారిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉంది..
-బీసీల జనాభా లెక్క తేలాకే ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు..
-బీసీ వర్గాలకు వాటా ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం హర్షనీయం
-కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు సమన్యాయం
–కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: రాబోయే రెండు మూడు నెలల్లో బీసీల జనాభా లెక్క తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. సోమవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుదు పిలుపునిచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలను స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, ఎంపిటిసిలుగా జడ్పిటిసిలుగా, ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్ లుగా గెలిపించుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఇందుకోసం అహర్నిశలు అందరం కలిసి కష్టపడి పని చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. జనాభా పరంగా బీసీలకు దక్కాల్సిన వాటా అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలకులు బీసీలను ఏమాత్రం పట్టించుకోలేదని, వారికి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. బీసీలను చీమను చూసినట్టు చూశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు సమా న్యాయం జరుగుతుందని చెప్పారు. అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాహూల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యంగా 24 గంటలు శ్రమిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటా తీసుకెళ్తామని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.