
–రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో ఎక్కడ జరిగింది?
-40% మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆగస్టు 15 వరకు ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 49 వేల కోట్లకు గాను కేవలం 17 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని, రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ ఎక్కడ జరిగిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో మీటింగ్ పెట్టినప్పుడు రుణమాఫీ మొత్తం 49 వేల కోట్లు అవసరం ఉంటుందని చెప్పి తర్వాత తొండి చేసి రైతుల రుణమాఫీ విషయంలో 100శాతం రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేశాడని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 40,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలో తొమ్మిది వేల కోట్లు తగ్గించి 31 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పారని, బడ్జెట్లో మాత్రం 26 వేల కోట్లు మాత్రమే కేటాయించారని చివరికి కేవలం 17,934 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారని అన్నారు. 31 వేల కోట్ల రుణమాఫీ 47 లక్షల మంది రైతులకు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు. భట్టి విక్రమార్క బ్యాంకర్లతో 7500 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశామని చెప్పారని అన్నారు. అసలు ఈ ప్రభుత్వం రైతులతో ఎందుకు ఆడుకుంటుందో అర్థం కావడం లేదన్నారు. రైతు రుణమాఫీ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ 40శాతం మంది రైతులకు మాత్రమే చేశారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని వెంటనే షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే రైతుబంధు ఇప్పటివరకు ఇవ్వలేదని, ఇంకా కొన్ని రోజులు అయితే పంటలు కోతలు కూడా పూర్తవుతాయని అన్నారు. రైతు భరోసా విషయంలో కూడా ప్రభుత్వం రెండు ఎకరాలు మూడెకరాల అంటూ మాట్లాడుతుందని, రైతులందరికీ షరతులు లేకుండా రైతు భరోసా ఇవ్వాలని అన్నారు. రైతు భరోసా రుణమాఫీ పూర్తి చేయని యెడల కాంగ్రెస్ నాయకులను మొదలు పెట్టుకొని ముఖ్యమంత్రి వరకు బయట తిరగనివ్వమని హెచ్చరించారు. అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళిత బందు పైలెట్ ప్రాజెక్టును హుజురాబాద్ లో 18 వేల కుటుంబాలకు అందించారని, దీంట్లో రెండో విడత 50వేల నుంచి మొదలుకొని ఐదు లక్షల వరకు సుమారు 5 వేల కుటుంబాలకు రావలసి ఉందని వారందరికీ అకౌంట్లో డబ్బులు జమ అయి కూడా ఉన్నాయని తెలిపారు. వెంటనే ఫ్రీజింగ్ ఎత్తివేసి వారికి రెండో వింత దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండో విడత వెంటనే ఇవ్వకుంటే దళితులందరితో కలిసి కలెక్టరేట్ ముట్టడించడంతో పాటు కాంగ్రెస్ నాయకులను ఊళ్లలో తిరగనివ్వమని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ బోయిన్ పల్లి వినోద్ కుమార్, కరీంనగర్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్లు గందె రాధిక శ్రీనివాస్, తక్కలపల్లి రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, రాజ్ కుమార్, మండల అధ్యక్షుడు సంఘం ఐలయ్య, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


