విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో హఠాన్మరణం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విధి నిర్వహణలో ఉండగా ఆర్టీసీ డ్రైవర్ ఒక్కసారిగా గుండెపోటుకు గురై ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడం హుజురాబాద్ లో కలకలం సృష్టించింది. వివరాలలోకి వెళితే ఇలా ఉన్నాయి. హుజురాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేసే ఠాకూర్ రమేష్ సింగ్ (45) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికి చెందిన రమేష్ సింగ్ గత 15 రోజుల క్రితమే పరకాల ఆర్టీసీ డిపో నుండి డిప్యూటేషన్ పై హుజురాబాద్ డిపోకు వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఈరోజు విధి నిర్వహణలో భాగంగా హుజురాబాద్ నుండి హైదరాబాదుకు బస్సు నడుపుకుంటూ వెళ్తూ గజ్వేల్ సమీపంలోకి వెళ్ళగానే గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే తనే గుర్తించి ప్రయాణికులకు చెప్పడంతో వారు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. గజ్వేల్ ధావఖనకు తీసుకువెళ్లి వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు చెప్పారన్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బస్సు నడుపుతున్న సమయంలో బస్సులో సుమారు 45 మంది ఉండగా గుండెపోటుకు గురైతున్నానని గుర్తించి ఎంతో చాకచక్యంగా బస్సును నిలిపివేసి తన నొప్పిని తోటి కండక్టర్ కు, ప్రయాణికులకు చెప్పి మరి ప్రయాణికుల ప్రాణాలు కాపాడి తను మాత్రం చనిపోవడం పలువురిని కలిసివేసింది. ప్రయాణికుల ప్రాణాలు కాపాడి తను మాత్రం ప్రాణాలు వదిలిన ఆర్టీసీ డ్రైవర్ ఠాకూర్ రమేష్ సింగ్ సేవలను ప్రయాణికులు కొనియాడారు. ఆయన మృతి పట్ల ఆర్టిసి హుజురాబాద్ డిపో మేనేజర్, ఉద్యోగులు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!