మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్ అక్టోబర్ 17: విద్యార్థులు గెలుపోటములతో సంబంధం లేకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఫిలిం భవన్ లో జిల్లా విద్యాశాఖ- సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కళా ఉత్సవ్ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 9 నుంచి 12 తరగతుల వరకు విద్యార్థులకు ఆరు అంశాల్లో(సంగీతం, వాయిద్య సంగీతం, నృత్యాలు, చిత్రలేఖనం, స్టోరీ టెల్లింగ్) పోటీలు నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి ఎంతో ఆకట్టుకుంటుందన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.