
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రొఫెసర్ సాయిబాబా మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆయనది రాజ్యం చేసిన హత్య అని వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో ప్రొఫెసర్ సాయిబాబా సంస్మరణ సభ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు ఆవునూరు సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వీక్షణ ఎడిటర్ ఇన్ వేణుగోపాల్ మాట్లాడుతూ…అన్యాయంగా ఉప చట్టం కింద 10 ఏళ్లు అత్యంత కఠినమైన అండా సెల్లో నిర్బంధించడం వల్లే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని అది ఆయన మరణాన్ని కారణమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రపంచ దేశాలకు తలొగ్గి ఉగ్రవాదాన్ని అణచివేసే ఉద్దేశంతో ఎన్నో ప్రమాదకరమైన చట్టాలను తీసుకొచ్చినప్పటికీ ఆ చట్టాలను వామపక్ష ఉద్యమాలను అణిచివేయడానికి ప్రయోగించిందని అన్నారు. సాయిబాబా కవిగా, రచయితగా, ఉపన్యాసకుడిగా, అణగారిన ప్రజల గొంతుకై నిలబడడాన్ని రాజ్యం జీర్ణించుకోలేకపోయిందని పేర్కొన్నారు. దేశంలోని ఆదివాసీలు, దళితులు ,నిరుపేదల పక్షాన ఆయన నిటారుగా నిలబడిన తీరు పాలకులకు నిద్ర పట్టకుండా చేసిందన్నారు. రాజ్యాంగ పరిధిని అతిక్రమించి పాశిష్టు పాలకులు సాయిబాబా పై ఉక్కు పాదం మోపి కుట్రపూరిత వ్యూహాన్ని రచించి అత్యంత క్రూరంగా అమలుపరిచిన విధానం మన ముందే జరిగిపోయిందని అన్నారు. సాయిబాబా విషయంలో న్యాయవ్యవస్థ తనకున్న స్వయం ప్రతిపత్తిని కాపాడుకోలేక పోయిందన్నారు. సాయిబాబా ది ముమ్మాటికి రాజ్యం చేసిన హత్య నని అందులో మొదటిదోషి చిదంబరం అని, ఆయన తెచ్చిన చట్టానికి పదును పెట్టి దాన్ని ప్రశ్నించే గలాలను అణిచివేసేందుకు దుర్వినియోగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరొకదోషి అని విమర్శించారు. ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, విప్లవ ప్రజాసంఘాల ప్రతినిధులు, ఉద్యమ సహచరులు, మేధావులు పాల్గొని బాబాకు నివాళులర్పించారు. సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ… తను నడవలేకపోయినా ప్రజా ఉద్యమాలకు నడక నేర్పిన నిజమైన విప్లవకారుడు సాయిబాబా అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరు వాసుదేవరెడ్డి మాట్లాడుతూ..తాను నమ్మిన సిద్ధాంతం కోసం తుది వరకు రాజీలేని పోరాటం సాగించిన సాయిబాబా నిబద్ధత, అంకితభావం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ జన సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ముక్కెర రాజు మాట్లాడుతూ..ప్రజాస్వామ్య శక్తుల ప్రతీకగా సాయిబాబాను అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బాబ్జి, భరత్, సారన్న ఆలపించిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ సమావేశంలో ప్రొఫెసర్ సాయిబాబా కుమార్తె మంజీరా, ప్రజా సంఘాల నాయకులు పొడిశెట్టి వెంకటరాజాం, వేల్పుల రత్నం, సదానందం, జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
