మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
విద్యార్థులు భవిష్యత్తుపైనే దృష్టి పెట్టాలని, మత్తుకు నో చెప్పాలని హుజురాబాద్ ఎక్సైజ్ ఎస్సై వినోద్ కుమార్ అన్నారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని న్యూ శాతవాహన హైస్కూల్లో ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మత్తు పదార్థాలు-అనర్థాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ…ప్రతి విద్యార్థి మత్తు పదార్థాల పట్ల అవగాహన కలిగి ఉండాలని వాటిని సేవించడం వల్ల భవిష్యత్తు అంధకారమవుతుందని అన్నారు. స్నేహితుల వల్ల ఇతరుల వల్ల మత్తు పదార్థాలను అలవాటు చేసుకోవద్దని అన్నారు. మొదట మొహమాటంతో మొదలై తర్వాత మత్తు పదార్థాలకు బానిస అవుతారని అన్నారు. విద్యార్థులు పాఠశాల నుండి ఇంటికి వెళ్లిన తర్వాత సోషల్ మీడియాపై దృష్టి పెట్టకూడదని దానివల్ల భవిష్యత్తు అంధకారం అవుతుందని అన్నారు. తల్లిదండ్రుల ఆలోచనలను గౌరవించి చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. మీ పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాలు గంజాయి హేరాయిన్,కొకైన్ తదితర వాటిని వాడుతున్నట్లు మీ దృష్టికి వచ్చిన 1098 ఫోన్ చేయాలని అన్నారు. ఈ సందర్భంగా పిల్లలచే మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వకుళాభరణం వెంకటేశ్వర్లు, పరాంకుశం కిరణ్ కుమార్, పోలీస్ సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు