
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామ సమీపంలో కాకతీయ ప్రధాన కాలువలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యము కాగా ఆమెది హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగరంకు చెందిన దూలం సరోజన(50)గా గుర్తించినట్లు హుజురాబాద్ టౌన్ సీఐ తిరుమల్ గౌడ్ రాత్రి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని పెద్దపాపయ్యపల్లి- కందుగుల గ్రామాల మధ్య కాకతీయ కాలువలో ఫోర్ లైన్ రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం కొట్టుకు వచ్చి పనుల వద్ద నిలిచింది. దీంతో స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. మహిళ నీలిరంగు చీర, జాకెట్ ధరించి ఉందని, వయస్సు దాదాపు 50 సంవత్సరాలు ఉంటుందని, ముక్కుపుడక ఉందని, మహిళను గుర్తుపట్టిన వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సీఐ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడంతో మృతదేహాన్ని హుజురాబాద్ హెల్ప్ టిం సభ్యులు గుర్తించి మహిళా సమాచారాన్ని సేకరించారు. దీంతో ఆమె మృతదేహాన్ని హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలోని మార్చూరులో భద్రపరిచారు. అనంతసాగర్ కు చెందిన దూలం సరోజన అనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమె మృతి చెందిన తీరుపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

