
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, భీమదేవరపల్లి/ హనుమకొండ,జనవరి15: మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ పి.వి.నరసింహారావు స్వస్థలం వంగర గ్రామంలో వీరభద్ర రథోత్సవం యాదవుల డోలు విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, హరిజన డప్పులు, మహిళల కోలాటల మధ్య ఆద్యంతం వైభవంగా సంక్రాంతి పర్వదినం మంగళవారంనాడు కొనసాగింది. కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బండ్లు తిరిగే రోజున వంగర గ్రామం నుండి పి.వి.కుటుంబీకులు ఈ రథోత్సవాన్ని వంద సంవత్సరాల కాలంగా నిర్వహిస్తున్నారు. ఈ రథం కొత్తకొండ చేరుకుని దేవాలయ పరిక్రమణ అనంతరం స్వామివారికి ఇష్టమైన బియ్యం, మంచి గుమ్మడి కాయలను దేవాలయానకి కానుకలుగా అందచేస్తారు. పివి వంశస్థుల తరపున పి.వి ప్రభాకర్ నెత్తిన గుమ్మడికాయ పెట్టుకొని సాంప్రదాయ రీతిలో రథానికి అందించారు. పి.వి.మనోహర్ ఇంటి వద్ద పి.వి.మదన్ మోహన్, పి.వి మాధవరావు ఇంటి వద్ద ఆయన కుమారుడు శరత్ వీరభద్రునికి మొక్కులు చెల్లించారు. వంగర గ్రామంలో నిర్వహించిన రథోత్సవాన్ని పి.వి తనయుడు పి.వి.ప్రభాకర్ రావు ప్రారంభించారు. అంతకుముందు ఆయనతోపాటు కుటుంబ సభ్యులు పి.వి శరత్, పివి.మదన్ మోహన్ గడిమైసమ్మకు, గ్రామదేవతలకు టెంకాయలు సమర్పించి ఆశిస్సులు పొందారు.
ఈ సందర్భంగా పి.వి.ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఈ రథోత్సవానికి అఫూర్వ చరిత్ర వుందని తమ కుటుంబానికి కొత్తకొండ వీరభద్రుడు ఇలవేల్పని తమ తండ్రిని దత్తత తీసుకున్న రంగారావు నాయనమ్మ సంతాన ప్రాప్తి కొరకు గ్రామస్థుల యోగక్షేమాల కొరకు కొత్తకొండ వీరభద్రునికి సంక్రాంతి వేల పూర్తిగా కలపతో తయారు చేసిన రథాన్ని తయారు చేసి కొత్తకొండకు చేరుకునే విధంగా స్వామివారిని మొక్కుకోవడ జరిగిందని నాటి నుండి నేటివరకు ఈ రథోత్సవం క్రమంతప్పకుండా కొనసాగిస్తున్నామని అందుకే దీనికి వంద సంవత్సరాల చరిత్ర వుందని తెలిపారు. సాంప్రదాయం కొనసాగించే రీతిలో క్రమం తప్పకుండా తన సౌజన్యంతో విజయవంతం చేస్తున్నానని అంతకు ముందు సోదరుడు స్వర్గీయ పి.వి రాజేశ్వర్ ఈ కార్యక్రమంలో ప్రముఖపాత్ర వహించిన సంగతిని ప్రభాకర్ రావు గుర్తు చేసారు. కార్యక్రమ సమన్వయకర్త పి.వి.మదన్ మోహన్ మాట్లాడుతూ వంగర గ్రామంలోని రథం గతంలో మూడంతస్తులుగా వుండేదని విద్యుత్ తీగల కారణంగా ఒకే అంతస్తుకు కుదించామని, దీనకి కావలసిన చక్రాలు కొల్ల మల్లారెడ్డి వంశీకులు, రథాన్ని లాగేందుకు కాడెద్దులను రైతులు సమకూర్చుతారని తెలిపారు. వంగరలో జరిగే ఈ వేడుకలో క్రమంతప్పకుండా పాల్గొంటున్నట్లు వివరించారు.గ్రామస్థుల సహకారంతో ఈ వేడుక విజయవంతంగా జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పి.వి మనుమడు రాఘవేంద్ర కాశ్యప్ జూమ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రథోత్సవం వేడుకలో భాగస్వామ్యం అయిన కార్యకర్తలను పి.వి.ప్రభాకర్ రావు, పి.వి శరత్ బాబు, మదన్ మోహన్ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, శ్రీరమోజు మొండయ్య, ఒల్లాల రమేశ్, సతీష్ రెడ్డి, బుచ్చిరెడ్డి, మల్లా రెడ్డి, నల్లగోని లక్ష్మీనారాయణ, వడ్ల వెంకటేశ్వర్లు, శ్రీరామోజు సీను, లక్ష్మీకాంతరావు, మారెం సతీష్, ప్రభు, సుమన్, ఏ.గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


రథోత్సవంతో కొత్త కొండకు బయలుదేరుతున్న పీవీ కుటుంబీకులు



