
–బడ్జెట్ పై నేటి వరకు నోరు మెదపని కాంగ్రెస్ ఎంపీలు బిజెపి మంత్రులు
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నాటినుండి నేటి వరకు రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ప్రత్యేకమైన నిధులు కేటాయించక పోవడం, దీనిమీద నేటి వరకు కూడా బిజెపి మంత్రులు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ నోరు మెదపకపోవడం సిగ్గుచేటని బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి హరీష్ వర్మ అప్పని పేర్కొన్నారు. విద్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రైవేటీకరణను పెంచి పోషించే దిశగా కేంద్ర ప్రభుత్వం చూస్తుందని అందులో భాగంగానే విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన జమ్మికుంటలోని అమరవీరుల స్థూపానికి తెలంగాణ తల్లి చిత్రపటం పెట్టి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం అయన విలేకరులతో మాట్లాడారు. వివిధ ప్రాజెక్టుల కోసం ఆంధ్రకు 15 వేల కోట్లు కేటాయించిందని, మరి తెలంగాణకు ఎందుకు కేటాయించలేదని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. 50,65,345 కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 12,76,338 కోట్లు అంటే 25.2% వడ్డీ చెల్లింపులకు కేటాయించారని, వ్యవసాయ రంగానికి గతం కంటే 10,000 కోట్ల రూపాయలు తగ్గించారన్నారు. ఎరువుల సబ్సిడీకి 11,000 కోట్లు కోత విధించారని, ఉపాధి హామీ చట్టానికి గతంలో 89,154 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత బడ్జెట్లో 86,000 కోట్లు కేటాయించి 3000 కోట్ల కోత పెట్టారన్నారు. మధ్య తరగతి ప్రజానీకానికి ఆదాయప్పను 12 లక్షల వరకు మినహాయింపు ప్రకటించినప్పటికీ ధరల నియంత్రణపై ఉసే ఎత్తలేదని, బడా కార్పొరేట్ సంస్థలపై ఎటువంటి భారాలు విధించలేదని, భీమా రంగంలో 100% ఎఫ్ డిఐని అనుమతిస్తూ భీమారంగ ఉనికి ప్రమాదంలో పడేసిందన్నారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల నుండి 47 వేల కోట్ల రూపాయల విలువ చేసే వాటాలను ప్రైవేటు కార్పోరేట్ సంస్థలకు విక్రయించాలని నిర్ణయించిందని, ఇది ముమ్మాటికి ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టే బడ్జెట్ తప్ప సామాన్య పేద మధ్యతరగతులకు ఉపయోగపడే విధంగా లేదని విమర్శించారు. నిజంగా బిజెపి ప్రభుత్వానికి దేశం మీద ప్రేమ ఉంటే పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా బడ్జెట్లో మార్పులు చేర్పులు చేయాలని హరీష్ వర్మ డిమాండ్ చేశారు.

