
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(జగిత్యాల): జగిత్యాల జిల్లా చిన్న కోడూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై దుర్మరణం చెందారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొక్కుల శ్వేత గతంలో వెల్గటూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆమె జగిత్యాల జిల్లా డిసీఆర్బీ (డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో)లో ఎస్సైగా పని చేస్తున్నారు.
సోమవారం ఆమె గొల్లపల్లి నుంచి జగిత్యాలకు తన కారులో ప్రయాణిస్తుండగా చిల్వకోడూరు వద్ద ఈ దుర్ఘటన జరిగింది. శ్వేత ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సై కే శ్వేత తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో బైక్పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కూడా అదే చోట మృతిచెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సమాచారం అందుకున్న జగిత్యాల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల అసలు కారణాలు ఏంటి అనే దానిపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఒకేసారి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం, అందులో మహిళా ఎస్సై దుర్మరణం పాలు కావడం పోలీసు వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.




