
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కోరిన కోరికలు తీర్చే శ్రీ మత్స్యగిరింద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేడు కళ్యాణ మహోత్సవంతో ప్రారంభంకానున్నాయి. ప్రభుత్వ అనుసంధాన అధికారుల సమన్వయంతో శ్రీ మత్స్య గిరింద్ర స్వామి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద గుట్టపై 11 శతాబ్దంలోనే విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెలసినట్లు చరిత్ర చెబుతోంది. దశావతారాలలో ఒకటైన మత్స్యావతారం ఇక్కడే వెలసినట్లు భక్తుల విశ్వాసం, మత్స్యగిరింద్ర స్వామిని దర్శించుకునేందుకు వివిధ జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీ ఎత్తున ఇక్కడికి వస్తుంటారు అని ఆలయపు పూజారి తెలిపారు. ఈ దేవాలయం కాకతీయుల కాలంలో నిర్మించబడినట్లు చెప్తారు. స్వామివారు భూదేవి, శ్రీదేవి సమేతంగా ఇక్కడ వెలసినట్లు చెప్తారు. గుట్టపై ప్రశాంత మైన వాతావరణంలో మాఘమాసంలో 12 రోజులపాటు ఇక్కడ స్వామివారి జాతర జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. ఇక్కడి కోనేరులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం, జాతర సమయంలో వేలాది మంది భక్తులతో ఆలయం సందడిగా కనిపిస్తుంది. ఇక్కడ అంజనేయ స్వామి ఆలయం, శివాలయం కూడా ఉన్నాయి. కేవలం ఈ ప్రాంతం నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు జాతర సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తారు. ఈ ప్రాంతానికి చెందిన చాలా మంది మత్స్య గిరింద్రుని తమ ఇలవేల్పుగా కొలుస్తారు భక్తులు.

