
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికే అఖండ మెజార్టీతో గెలిపించాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీశ్రేణులకు,పట్టభద్రులకు పిలుపునిచ్చారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి.నరేందర్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తిమ్మాపూర్ మండలం అల్గునూరులోని లక్ష్మినర్సింహ కన్వెన్షన్ లో పట్టభద్రుల దశ-దిశ పేరిట నిర్వహించిన మానకొండూర్ నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పరిచయం అక్కర లేని వ్యక్తి అని, కష్టపడి ఎదిగిన ఆయన విద్యారంగానికి అందించిన సేవలు శ్లాఘనీయన్నారు. విద్యాసంస్థలను స్థాపించిన నరేదంర్ రెడ్డి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడమే కాకుండా తమ సంస్థల్లో 5వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. విద్యారంగ సమస్యలే కాకుండా పట్టభద్రుల సమస్యలను తెలిసిన నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ అండదండలతో పట్టభద్రుల సమస్యలను తీర్చగలుగుతారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నరేందర్ రెడ్డిని గెలుపించుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులపైననే ఉందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి గుర్తు చేశారు.
పట్టభద్రులు విజ్ఞతను ప్రదర్శించాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విషయంలో పట్టభద్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ కోరారు. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన విషయాన్ని పట్టభద్రులు గుర్తించుకోవాలని కోరారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పనపై నిరంతరం శ్రమిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన బాధ్యత విద్యావంతులైన నిరుద్యోగులు, పట్టభద్రులపైన ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఎన్నో మంచి పనులు చేసిందని, రెండు లక్షల రుణమాఫీని 90 శాతం మందికి వర్తింపజేసిందని, వివిధ సాంకేతిక కారణాలతో 2లక్షల రుణమాఫీ పొందని పదిశాతం మందితో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఎమ్మెల్యే కవ్వంపల్లి దుయ్యబట్టారు.
గెలుపు కోసం కసిగా పని చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడే గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి.జీవన్ రెడ్డిని గెలిపించుకున్నామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గుర్తు చేశారు. అప్పుడే ఎమ్మెల్సీని గెలిపించుకున్న మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నవేళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడం కష్టమా అని ఆయన ప్రశ్నించారు. అయితే అతి నమ్మకం పనికి రాదని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కసిగా పని చేసి అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కులమతాల పేరిట ఓట్లకు గాలం
ఎన్నికల సమయంలో కులమతాల పేరుతో ఓట్లు దండుకునేందుకు కొన్ని పార్టీలు, కొన్ని శక్తులు కుట్రపన్నుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. ఇలాంటి తరుణంలో మరింత అప్రమత్తతో వ్యవహరిస్తూ కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఓ పట్టభద్రుల ఎమెల్సీ అభ్యర్థి దేవుళ్ల పేరుతో ఓట్లు అడుగుతున్నారని, పట్టభద్రులు, మేథావులు ఆలోచించాలన్నారు. కుల,మతాల పేరిట ఓట్లు అడగటం సహేతుకం కాదని, కులమతాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుతంగా పాలన సాగిస్తున్నారని, ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 55వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరింత మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు వీలుగా మెగా డీఎస్సీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నదని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే విద్యారంగ అభివృద్ధికి, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పాటుపడతానన్నారు. అంతే కాకుండా జాతీయ విద్యాసంస్థలను తీసుకు రావడానికి ఆయన హామీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారాలు చేయించడానికి ప్రత్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎదుగుతున్న వ్యక్తిని లాగేయాలనే ప్రయత్నంలో భాగమే ఈ తప్పుడు ప్రచారాలని ఆయన పేర్కొన్నారు. పట్టభద్రులు వాస్తవాలు గ్రహించి విజ్ఞతను ప్రదర్శించాలని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నరేందర్ రెడ్డి పట్టభద్రులను కోరారు.
ఈ సమావేశంలో పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధగోని లక్ష్మినారాయణగౌడ్, ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి (తిమ్మాపూర్), నందగిరి రవీంద్రచారి (మానకొండూర్), గోపగోని బస్వాగౌడ్, ముస్కు ఉపేందర్ రెడ్డి (గన్నేరువరం), ముక్కిస రత్నాకర్ రెడ్డి (బెజ్జంకి), బి.రాఘవరెడ్డి (ఇల్లంతకుంట), మార్కెట్ కమిటీ చైర్మన్లు పులి కృష్ణ (బెజ్జంకి), మర్రి ఓదెలు యాదవ్ (మానకొండూర్), ఐరెడ్డి చైతన్య-మహేందర్ రెడ్డి (ఇల్లంతకుంట), నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అట్ల అనిల్ కుమార్, మహిళా కాంగ్రెస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కవ్వ పద్మ, అల్గునూరు డివిజన్ అధ్యక్షుడు తమ్మనవేణి రమేశ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి తదితరులు పాల్గొన్నారు.





