
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ లోని స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ విద్యార్థులు ప్రతిష్టాత్మక ఎస్ఆర్ఎఫ్ ఒలంపియాడ్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఏ సిరిచందన, ఎస్ అక్షర రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించడంతో పాటుగా అధిక సంఖ్యలో విజ్ఞాన్ విద్యార్థులు వివిధ తరగతుల వారిగా జిల్లాస్థాయి ప్రధమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించి హనుమకొండ పట్టణంలోని ప్రతిష్టాత్మక కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో అధ్యక్షులు తుమ్మ అమరేష్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో పాల్గొని కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి, రిజిస్టార్ ప్రొఫెసర్ రామచంద్రం మరియు డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ రెడ్డి చేతులమీదుగా అవార్డులు స్వీకరించడం జరిగిందని విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా కోటేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న విజ్ఞానశక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇటువంటి పోటీ పరీక్షలు దోహదపడతాయని అన్నారు. అలాగే ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ముందు వరుసలో నిలుపుటకు మా విజ్ఞాన్ పాఠశాల ఉపాధ్యాయ బృందం ఇచ్చిన శిక్షణకు నిదర్శనంగా మా విద్యార్థులు సాధించిన ప్రస్తుత ఫలితాలు నిలుస్తాయని తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులు అందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ పాఠశాల కరెస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్ తో పాటు డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం తిరుపతి, మమత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


