
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిడిఎస్యు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
కేంద్రం ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కరీంనగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని, ఈ సందర్భంగా పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ నాయకులతో కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర బడ్జెట్ పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని, కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందన్నారు. రైతులకు, కార్మికులతోపాటు పేద ప్రజానికానికి ఈ బడ్జెట్ వ్యతిరేకంగా ఉందన్నారు. వ్యవసాయ రంగానికి, ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధించారన్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్విర్యం చేసి, ప్రయివేటీకరణకు పెద్దపీట వేయాలని కేంద్రం చూస్తోందన్నారు. బీమా రంగంలో 100శాతం ఎఫ్‌డీఐలు తీసుకురావాలని బడ్జెట్లో ప్రవేశపెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి రూ. 47వేల కోట్ల వాటాలను ఉపసంహరించుకున్నారని, బీమా రంగాన్ని 100 శాతం ప్రయివేటీకరణ చేయాలని చూస్తోందన్నారు. రైతులకు, ఆహార రంగాలకు ఇచ్చే సబ్సిడీలో సైతం కోత పెట్టారని, బీమారంగాన్ని ప్రయివేటీకరణ చేయాలని చూస్తోందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్విర్యం చేస్తోందన్నారు. కరీంనగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిన కేంద్రాన్ని గద్దెదించాలన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణకు చేసిందేమీలేదని, రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేని అసమర్ధులన్నారు. ఇక్కడినుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ, బండి సంజయ్ కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ జిల్లాకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమైనాడన్నారు. తక్షణమే నిధులు తెస్తారా లేక రాజీనామ చేస్తారా ఆలోచించుకోవాల్సిన అవసరముందన్నారు. కార్మిక, రైతులను విస్మరించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలన్నారు. తెలంగాణలో ఉన్న వనరులను, ఖనిజ సంపదను కేంద్రానికి అప్పజేప్పాలని ఇక్కడున్న బీజేపీ ఎంపీలు చూస్తున్నారని మండిపడ్డారు. ఈ బడ్జెట్ కేవలం 40శాతం మందికి అనుకూలంగా ఉందన్నారు. జిల్లాకు త్రిబుల్ ఐటీ ఐఐఎం నవోదయ సైనిక్ స్కూల్ లాంటి సంస్థలు ప్రకటిస్తారని ఆశించినప్పటికీ నిరాశ ఎదురయింది అన్నారు. జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కొత్తపల్లి- మనోహరాబాద్, కరీంనగర్-కాజీపేట రైల్వే లైన్ల ఊసే లేదన్నారు. ఈ దేశ సామాన్యులను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఈ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు నిరసన తెలియజేయడమైనదని, ఈబడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌కు పూర్తిగా నిధులను తగ్గించారన్నారు. అంతేకాకుండా మౌలిక అంశాలు విద్యా, వైద్యం, తాగునీరు, రోడ్లుతోపాటు తదితర అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించిన నిధుల కోత విధించారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన హామీలు బయ్యారం ఉక్కఫ్యాక్టరీ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీల నిర్మాణం, విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్రబడ్జెట్లో మన వాటా మనం సాధించుకునే విధంగా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. జిల్లా ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని గప్పాలు కొట్టే బండి సంజయ్ జిల్లాకు కొన్ని నిధులైనా సాధించ లేనప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి ఏం లాభమని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి నిధులను రాబట్టాని సూచించారు. వ్యవసాయ రంగంలో, కార్మిక రంగంలో ఉత్పత్తులను పెంచేవిధంగా బడ్జెట్ ఉండాలన్నారు. గా మహిళలకు ఆహార భద్రత కొరవడిందన్నారు. మహిళలకు భద్రత కల్పించే విధంగాను, ఆత్మహత్యలు, వలసలను నిరోదించే పద్దతిలో బడ్జెట్ ఉండాలన్నారు. బడ్జెట్లో మా నిధులు మేము రాబట్టుకునే విధంగా ప్రజలందరిని సమాయత్తం చేసి పోరాటాలను ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వర్కొలు రాజు, మింటు, రామ్ చరణ్, అభినవ్, బొక్కల రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.

