
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (ధర్మపురి) రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్తకు పారిశ్రామికవేత్తకు పోటీ నడుస్తుందని నోట్ల కట్టలతో వస్తున్న పారిశ్రామికవేత్తకు పట్టభద్రులంతా ఓట్లతో బుద్ది చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ధర్మపురి పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు, పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా తన విద్యా సంస్థల్లో నాణ్యమైన క్రమశిక్షణతో కూడిన విద్యనాంధిస్తూ అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగ నిరుద్యోగ పట్టభద్రుల సమస్యల పట్ల అవగాహన ఉన్న తనకు తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. తన ప్రత్యర్ధులు ఓటమి భయంతో సోషల్ మీడియా ద్వారా కోట్లు వెచ్చించి తనపై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ఎమ్మెల్సీగా గెలిచి విద్యాసంస్థలు యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తానని తన ప్రతిపక్షాలు తనపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో ఒక్క విద్య సంస్థను కూడా నెలకొల్పేది లేదని వెల్లడించారు. నాలుగు జిల్లాల పరిధిలో NSUI, యూత్ కాంగ్రెస్, సోషల్ మీడియా చాలా చురుకుగా పనిచేస్తుందని ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు, వివిధ సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు.





