
–జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లు తెలంగాణ భవిష్యత్తుకు కీలకం…
–బిఆర్ఎస్ పట్టభద్రుల , టీచర్స్ ల విశ్వాసం కోల్పోయింది.. అందుకే పోటీకి దూరమైంది..
–తక్కువ వ్యవధిలోనే కాంగ్రెస్ సర్కార్ తీవ్ర వ్యతిరేకత మూట గట్టుకుంది..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జరగబోయే పట్టభద్రుల , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు కీలకంగా మారనున్నాయని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని ఆదివారం రోజున హుజురాబాద్ బిజెపి పట్టణ మండల అధ్యక్షులు తూర్పాటి రాజు రాముల కుమార్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బిజెపికి దేశంలోనే కాకుండా , తెలంగాణ ప్రజల్లో కూడా బలమైన ఆదరణ లభిస్తుందని , అన్ని వర్గాల ప్రజల ఆదరణతో, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 41 శాతం ఓటు షేర్ సాధించే అవకాశం ఉందని ప్రముఖ సర్వే ఏజెన్సీల రిపోర్ట్ విడుదల చేసిందని, ప్రస్తుతం జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ప్రభంజనం కనబడుతుందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టభద్రుల, టీచర్స్ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, బిఆర్ఎస్ పూర్తిగా వారి విశ్వాసాన్ని కోల్పోయిందని అందుకే నేడు పోటీ చేయలేని పరిస్థితికి వచ్చిందన్నారు. అలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనతి కాలంలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత మూట గట్టుకుందన్నారు. నిరుద్యోగ భృతి నెలకు 4000 అందిస్తామని నిరుద్యోగ పట్టభద్రులను మోసం చేసిందన్నారు. అలాగే ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. అందుకే పట్టభద్రులు, టీచర్స్ ఈ ఎన్నికల్లో బిజెపి వైపు చూస్తున్నారన్నారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘోర పరాభవం తప్పదన్నారు.ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యలు భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి, బంగారు రాజేంద్రప్రసాద్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్, భూత్ ఇన్చార్జిలు ముప్పు మహేష్, చిదురాల శ్రీనివాస్, రావుల వేణు, తిప్పపతిని రాజు, అంకటి వాసు, పచ్చీస్ ప్రభారులు, జిల్లా నాయకులు, పట్టణ, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

