
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల ఓట్లు అడిగేందుకు సీఎం రేవంత్ రెడ్డికి దమ్ములేదు, కాంగ్రెస్ పార్టీకి ముఖం లేదని మల్కాజ్గిరి ఎంపీ, బిజెపి జాతీయ కమిటీ సభ్యులు ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. హుజురాబాద్ లోని మధువని గార్డెన్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, టిఆర్ఎస్ ను నమ్మరని,
ఇద్దరినీ చూశాం ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ఈటల పేర్కొన్నారు. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని ప్రజలు బాధపడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలన మీద మాట్లాడుతున్న పార్టీ బీజేపీ ఒక్కటేనని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రేవంత్ రెడ్డికి దమ్ము లేదని, కాంగ్రెస్ పార్టీకి ముఖం లేదన్నారు. నాయకుడు అనే వాడికి అనేక బాధలుంటాయని, అన్నింటిని దిగమింగుకోవాలన్నారు. దిగమింగుకొని అధిగమించిన వాడే ధీరుడు అని,
సమస్య వస్తే పారిపోయేవాడు లీడర్ కాదని, రాజకీయాలు పూలబాట కాదు ముల్లబాట అని చెప్పారు. నేను 365 రోజులు 24 గంటలు పనిచేసే వాడినని, నాకు సెలవలు లేవు, జ్వరం వచ్చిందని పడుకున్న సందర్భాలు లేవు అని ఈటెల రాజేందర్ గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులు కొమరయ్య, అంజిరెడ్డిలను గెలిపించమని కోరేందుకు మీదగ్గరకు వచ్చా… ఈ గెలుపు రేపటి గెలుపుకు నాంది పలకాలి..- ఈటెల రాజేందర్.
హుజురాబాద్ నా గడ్డ..నాకు వచ్చిన అతి కష్టకాలంలో నాకు అండగా నిలబడ్డది హుజురాబాద్ గడ్డ అని ఈటల రాజేందర్ అన్నారు. కన్నీళ్ళకు కరిగిపోయారో.. మోసపు మాటలకు కరిగిపోయారో ఇబ్బందులు పడతారని గుర్తు చేశారు. జరిగింది జరిగిపోయింది, జరిగింది మన మంచికే అనుకోవాలని కార్యకర్తలకు సూచించారు. అప్పట్లో హుజురాబాద్ పేరు చెప్తే మంచినీళ్ళిచ్చి గౌరవించారని, ఇప్పుడు అట్ల ఎట్లా రాజేందర్ ను ఓడించారని దెప్పిపొడుస్తున్నారు అని, అది అనుభవించారు.. ఇది భరించారు అని నాయకులకు కార్యకర్తలకు గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మీ గెలుపు కోసం నేను వచ్చి ప్రచారం చేస్తానని, హుజూరాబాద్ ప్రజలు నా మాట వింటారని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక బాధలుంటాయని అన్నింటిని దిగమింగుకోవాలని, దిగమింగుకొని అధిగమించిన వాడే ధీరుడని, సమస్య వస్తే పారిపోయేవాడు లీడర్ కాదు అని,
రాజకీయాలు పూలబాట కాదు ముల్లబాట అని ఈటల గుర్తు చేశారు. మన మీద జరుగుతున్న కుట్రలన్ని ప్రజలు గమని స్తున్నారని, అన్ని చూసి ప్రజలు జడ్జిమెంట్ ఇస్తారని,
ప్రజల మీద సంపూర్ణ విశ్వాసం ఉండాలని వారితో కలిసి నడవాలన్నారు.
వచ్చే ఎన్నికల్లో వార్డు మెంబర్ నుండి ప్రతి ప్రజాప్రతినిధిని గెలిపించుకునే బాధ్యత నాది అని, నా ఎన్నికలో ఎలా పనిచేస్తానో మీ ఎన్నికలకు కూడా అలానే పని చేస్త అని ఈటల చెప్పారు. మీ అందరికీ తెలుసు, యువకులకు కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చుకున్నాం, నాట్ పాజిబుల్ అనేది నా డిక్షనరీలో లేదు, నా జీవితంలో హాలిడే అనే పదం లేదు అన్నారు. నా జీవితంలో మధ్యాహ్నం పూట పడుకున్నది లేదు, నా జీవితంలో జ్వరం వచ్చిందని సెలవు తీసుకున్నది లేదు, 365 రోజులు 24 గంటలు మిషన్ లెక్క పని చేసే మనిషిని, నన్ను నడిపిస్తున్నది, నాశక్తి, నా వయసు కాదు, ప్రజల స్ఫూర్తి, ప్రజల అవసరం నన్ను నడిపిస్తుందన్నారు. మొన్న నన్ను గెలిపించిన మల్కాజ్గిరి ప్రజలను కూడా చూసుకునే బాధ్యత నా మీద ఉందని, సగం హైదరాబాద్ మల్కాజిగిరిలో ఉంటుందని, 29 రాష్ట్రాల ప్రజలు ఉండే మినీ ఇండియా మల్కాజ్గిరి అన్నారు. పేదవాళ్ళ అడ్డా కూడా అదే అని,
అనేక రకాల సవాళ్లు ఉన్నాయన్నారు. నేను పదేపదే రాలేకపోవచ్చు కానీ మీతోనే ఉంటాను అని చెప్పారు.
రేవంత్ రెడ్డికి దమ్ములేదు, కాంగ్రెస్ కు ముఖం లేదు:
ప్రజాక్షేత్రంలో సంపూర్ణంగా వెలిసిపోయిన పార్టీ కాంగ్రెస్ కాగా
కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అని, కాంగ్రెస్ కార్యకర్తలే రేవంత్ రెడ్డే మా చివరి సిఎం అనుకుంటున్నారని ఈటల ఎద్దేవా చేశారు. సీఎం సభ పెడితే…సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తారనుకుంటాం…కానీ 317 GO సవరిస్తా అనో, ఐదు డిఏలు విడుదల చేస్తామనో, హెల్త్ కార్డులు ఎప్పటిలోగా ఇస్తారనే స్పష్టతనో, CPS రద్దు గురించో చెప్తాడని భావించాము కానీ ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదని తీవ్ర నిరాశ చెందారన్నారు. రిటైర్డ్ అయితే ఉద్యోగికి రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎనిమిది శాతం లంచం ఇవ్వాల్సిన దుస్థితి వచ్చిందని ఈటెల ఆరోపించారు. వీటి గురించి మాట్లాడే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని, టీచర్ ఎమ్మెల్సీగా పలానా అభ్యర్థికి ఓటు వేయాలని కోరే ముఖం కాంగ్రెస్ కు లేదని, టిఆర్ఎస్ కి అభ్యర్థి లేడని ఎద్దేవా చేశారు. కేజీబీవీ టీచర్ల బాధలు, నాన్ టీచింగ్ స్టాఫ్ సమస్యలు, మోడల్ స్కూల్ ఉద్యోగులకు కనీసం హెల్త్ కార్డు లేకపోవడం అనేక సమస్యలున్నాయన్నారు. ప్రైవేట్ కాలేజీలలో, స్కూళ్లలో ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ను 2021 నుంచి పెండింగ్లో పెట్టింది, డబ్బులు ఇవ్వమని సిఎం దగ్గరికి పోతే.. సెటిల్మెంట్ చేసుకుందామంటూ జోకులు వేస్తున్నారట అని ప్రైవేట్ కళాశాలల వారు కన్నీళ్లు పెడుతున్నారని, అధ్యాపకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డమని కన్నీళ్లు పెడుతున్న పరిస్థితిని రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారాన్నారు.
టీచర్ల గ్రాడ్యుట్ల సమస్యల మీద కొట్లాడిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ... ఈటల.
ఈ ప్రభుత్వం మీద అంకుశంతో పొడిచి మేల్కొల్పే సత్తాఉన్న పార్టీ బిజెపి ఒక్కటేనని, 15 నెలలుగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. ఆరు గ్యారంటీలు 66 హామీలు 420 రకాల పనులు చేస్తానంటూ..మాటల గారడీ చేసి గెలిచారనీ,
అమెరికాలో రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు.. ప్రజలు ఎప్పుడు కూడా నిజాన్ని నమ్మరు..అబద్ధాలే ఇష్టపడతారు.. అబద్ధాలు ఆడి నేను ముఖ్యమంత్రి కాదల్చుకున్న అని చెప్పి మరి అయ్యాడు అని ఈటల గుర్తు చేశారు. ఐదేళ్లు ఒక ఎమ్మెల్యే పదవి, ఒక ఎంపీ పదవి సక్కగా చేయకపోతివి..ఒకసారి మంత్రి కాకపోతివి.. ఇన్ని హామీలు ఇస్తున్నవు ఎలా సాధ్యమైతది అని ప్రశ్నించినప్పుడు..
నీకేం ఎరుక అన్నాడు రేవంత్ రెడ్డి అని ఈటల పేర్కొన్నారు.
ఈ హామీలు అమలు కావు అని చెప్పినా.. జనం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు వారంతా అయ్యో అయ్యో అని బాధపడుతున్నారన్నారు.
నిరుద్యోగ సమస్య పరిష్కారం – మోడీ లక్ష్యం:
నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడానికి నాలుగు లక్షల కోట్ల రూపాయలు 2024-25 కేంద్ర బడ్జెట్లో పెట్టారన్నారు. గంభీరమైన సమస్యను గుర్తించిన నాయకుడు నరేంద్ర మోడీ అని,
యువత చెడు మార్గాలు పట్టకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉందని గుర్తించిన నేత నరేంద్ర మోడీ అన్నారు. యువకుల్లారా నేను ఒక్కటే అప్పీల్ చేస్తున్నాను…మీరు అనేక మందిని చూశారు.. వారు చేసిందేంటో చూశారు, అక్కడ మీకోసం తపించే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇక్కడ మీకోసం కొట్లాడ గలిగే శక్తి ఉన్న పార్టీ బిజెపి అని ఈటెల పేర్కొన్నారు. 12 లక్షల రూపాయల ఇన్కమ్ టాక్స్ రాయితీ కల్పించి మధ్యతరగతి ఉద్యోగులకు లాభం చేసేలా చేసింది కేంద్ర ప్రభుత్వం అని, మీకోసం ఆలోచిస్తున్న బిజెపి గురించి ఆలోచించండని టీచర్లను కోరుతున్నానన్నారు. కెసిఆర్ కి అవకాశం ఇచ్చాము..రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చాము.. ఇక ఈసారి అవకాశం బీజేపీకి అని ప్రజలంతా అంటున్నారన్నారు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే..ఆర్థికంగా ఎదగాలంటే..నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే..ఉపాది కల్పన జరగాలంటే..సమగ్ర అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోడీ అండదండలతో బిజెపి ప్రభుత్వం కొలువు తీరాలి అని బలంగా నమ్ముతున్నారన్నారు.
బిజెపి ఎక్కడ ఉంది అని అడిగిన వారికి హుజురాబాద్లో లక్షా ఏడువేల మెజారిటీ ఇచ్చి గెలిపించారని, పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం ఓట్లు వేసి 8 సీట్లు గెలిపించి బిజెపిని అజేయంగా నిలిపారన్నారు. ఈ 15 నెలలుగా ప్రజల సమస్యల మీద కోట్లాడుతున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని, హైడ్రా, మూసి, లగ్గిచర్ల, పేదల భూములు గుంజుకుంటున్న ప్రతి సందర్భంలో వారికి అండగా నిలబడింది బిజెపి అని ఈటెల పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం, ద్రోహం చేసే ప్రభుత్వం, అబద్ధాల పునాదుల మీద రాజ్యమేలాలని చూస్తున్న ప్రభుత్వం అన్నారు. దీనిని సరైన పద్ధతిలో పెట్టాలంటే ప్రశ్నించే బిజెపి ప్రజా ప్రతినిధులతోనే సాధ్యం అని, ఇది చారిత్రాత్మక సందర్భం అన్నారు. ఇంకా 36 గంటల సమయం ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా బిజెపికి బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేయించాలని ఈటెల విజ్ఞప్తి చేశారు.



