
Oplus_131072
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, మార్చి 02: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా షాపులు, వ్యాపార సముదాయాలు 24 గంటలూ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ఉత్తర్వులు ఈ రోజు నుంచి మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, చట్టంలోని నిబంధనల మేరకు రోజుకు 8 గంటల పనివేళల కంటే ఎక్కువ లేదా వారానికి 48 గంటలకు మించి పనిచేసిన ఉద్యోగులు, కార్మికులకు సాధారణ వేతనం కన్నా రెండింతలు చెల్లించాలి. అదనంగా, జీవో నం. 476 ప్రకారం, సెలవు రోజుల్లో పనిచేసే కార్మికులకు ప్రత్యామ్నాయ సెలవు కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగుల రాత్రి షిఫ్టుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయనున్నట్టు వెల్లడించింది.
