
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఏసిపి కార్యాలయంలో శనివారం ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ పోలీసులు కేక్ కట్ చేశారు. హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి సబ్ డివిజన్ పరిధిలోని మహిళా పోలీసులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా ప్రతి రంగంలో ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి మనిషి జీవితం ఒక తల్లి గర్భం నుంచే మొదలవుతుందని, స్త్రీలలో తల్లిని చూడాలన్నారు. కఠినమైన పోలీస్ ఉద్యోగంలో కూడా మహిళలు చాలా బాగా రాణిస్తున్నారని అన్నారు. మహిళ రక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలు చేసిందని, వారికి అన్యాయం జరిగితే మహిళా చట్టాలను ఉపయోగించుకోవాలని అన్నారు. అంతర్జాతీయ పోటీలలో కూడా మహిళలు తమ సత్తా చాటుతూ భారతదేశానికి ఎన్నో పథకాలు తీసుకువచ్చి దేశ గౌరవాన్ని మరింత పెంచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్, జమ్మికుంట సిఐ లు వరగంటి రవి, కిషోర్లతోపాటు సబ్ డివిజన్ పరిధిలోని మహిళా పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు హుజురాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో మహిళా దినోత్సవ సందర్భంగా మహిళ పోలీసులను టౌన్ సిఐ జి తిరుమల్ గౌడ్ ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.



