
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, ఏప్రిల్ 08: పట్టణ శివారులో ఉన్న చిలుకవాగుతో పాటు పలు కుంటల, చెరువుల భూములను కబ్జా చేశారని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య నీటిపారుదల శాఖ ఈఈ శశిభూషణ్ కు మంగళవారం కేసీ క్యాంపులోని కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ.. వరంగల్ ప్రధానరహదారిని ఆనుకొని ఉన్న చిలుకవాగు భూములలో ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. వారం క్రితం ఫిర్యాదు చేసినా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వాగులు, చెరువుల పక్కన చేపట్టే నిర్మాణాలకు ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ఓసీ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉండగా, అవేవీ లేకుండానే మున్సిపల్ అధికారులు యధేచ్చగా అనుమతులు ఇస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులను సమ్మయ్య సంప్రదించగా, స్థానిక అధికారులు వాగు పూర్తి కొలతలు అందిస్తేనే చర్యలు తీసుకోవడానికి వీలుంటదని చెప్పారని ఆయన అన్నారు. అలాగే, కలెక్టర్ సందర్శించి విచారణ జరిపితేనే కబ్జాలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. అక్రమ నిర్మాణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను గుర్తించి చట్టపరంగా కూల్చివేయాలని సమ్మయ్య అధికారులను కోరారు.


విలేకరులతో మాట్లాడుతున్న కొలిపాక సమ్మయ్య