
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. విషయం ఏమిటంటే.. ఓ గ్రానైట్ వ్యాపారిని డబ్బులు డిమాండ్ చేశాడని, నానా బూతులు తిడుతూ భయభ్రాంతులకు గురిచేసాడని ఆరోపిస్తూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వరంగల్ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదయిన విషయం ఈరోజు వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వివరాల మేరకు.. హనుమకొండ ఎక్సైజ్ కాలనీలో నివసించే కట్ట మనోజ్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండలం వంగపల్లిలో గత కొన్నాళ్లుగా గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే గత కొన్ని నెలల క్రితం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మనోజ్ రెడ్డిని బెదిరించి రూ: 25 లక్షలు వసూలు చేశాడని బాధితుడు భార్య కట్ట ఉమాదేవి ఆరోపించారు. అలాగే ఈనెల 18న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తిరిగి ఫోన్ చేసి తనకు రూ.50 లక్షలు ఇవ్వాలని, నానా బూతులు తిడుతూ.. చంపుతానని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తూన్నట్లు బాధితుడి భార్య ఈనెల 21న వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుడు కట్ట మనోజ్ రెడ్డి డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో అతని భార్య సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఐపిసి 308(2), 308(4), 352 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు పెట్టి, ఎఫ్ఐఆర్ 252/2025 నమోదు చేశారు సుబేదారి పోలీసులు. ఎప్పుడు వివాదాస్పదుడిగా ఉండే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై మరోసారి కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

సుబేదారి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కేసు నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ..

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..