
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత ఐదు రోజులుగా తిండి, తిప్పలు లేకుండా హుజురాబాద్ సబ్ రిజిస్టార్ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న ఓ వృద్ధ మహిళను మంగళవారం సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ గమనించి ఆమెకు అపన్న హస్తం అందించారు. వివరాలలోకి వెళితే…జమ్మికుంట మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన పూలవేన సారమ్మ అనే వృద్ధ మహిళ జమ్మికుంట రోడ్ లోని సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ తలదాచుకుంటుంది. ఆ ప్రాంతవాసులు ఎవరడిగినా ఏమీ మాట్లాడక మౌనంగా ఎక్కడో దగ్గర ఉంటుంది. కాగా మంగళవారం సామాజిక కార్యకర్త నలుబాల వేణు గోపాల్ ఆ వృద్ధ మహిళ విషయం తెలిసింది. ఐదు రోజులుగా తిండి లేక ఉంటున్న ఆ మహిళ దీనస్థితిని గమనించి వెంటనే ఆమెకు భోజనం తినిపించి ఈ విషయాన్ని ఐసిడిఎస్ అధికారులకు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న హుజురాబాద్ పోలీసులు సారమ్మ వద్దకు వచ్చి ఆమె వివరాలు తెలుసుకున్నారు. హుజురాబాద్ సిడిపిఓ మరాటి సుగుణ అంగన్వాడి సూపర్వైజర్ పద్మ సబితలు వచ్చి వృద్ధ మహిళ వివరాలు తెలుసుకొని కరీంనగర్ లోని వృద్ధాశ్రమానికి వాహనంలో తరలించారు. కాగా వృద్ధ మహిళ దీనస్థితిని గమనించి సాయం అందించిన వేణుగోపాలను రవీందర్ అజయ్ నాగరాజు లను పలువురు అభినందించారు.





