
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, మే 8: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో గత నెల 22న జరిగిన దారుణమైన ఉగ్రదాడికి నిరసనగా హుజూరాబాద్‌లో బుధవారం బేడ బుడగ జంగం జన సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సంఘ సభ్యులు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకుని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిరిపాటి వేణు మాట్లాడుతూ.. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన ఈ దుర్మార్గపు దాడిలో 26 మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతులను కేవలం హిందువులు, ముస్లింలుగా చూడకుండా భారతీయులుగా గుర్తించి వారి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులకు భారత సైన్యం ధీటుగా బదులివ్వడాన్ని ఆయన ముక్తకంఠంతో స్వాగతించారు. భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా కొనసాగిందని, ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడి చేసి సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం అభినందనీయమని కొనియాడారు. భారత సైన్యానికి బేడ బుడగ జంగం జన సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. ఉగ్రవాదుల ఆట కట్టించేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలను సంఘం పూర్తిగా సమర్థిస్తుందని సిరిపాటి వేణు స్పష్టం చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజల భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తూర్పాటి లింగయ్య, భూతం అంజి, గంధం మధు, తూర్పాటి రమేష్, తూర్పాటి అనిల్, తూర్పాటి రజినీస్, మల్లయ్య, తూర్పాటి దుర్గయ్య, మోటం రమేష్, కడమంచి స్వామి, మోటం సాయిలు, తూర్పాటి ఉపేందర్, భూతం తిరుపతితో పాటు పెద్ద సంఖ్యలో సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




హుజురాబాద్ లో పహల్గామ్ మారణహోమానికి నిరసనగా భారీ ర్యాలీ..ఉగ్ర స్థావరాలపై సైన్యం చర్యను ముక్తకంఠంతో స్వాగతించిన బేడ బుడగ జంగం సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు..