
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ ప్రాంత సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న కమిషనర్ కేంసారపు సమ్మయ్య పై కొంతమంది వ్యక్తులు కుట్రపూరితంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మారేపల్లి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కలవల మల్లయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కుమార్,కే సంపత్ కుమార్ లు పేర్కొన్నారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ….హుజురాబాద్ కమిషనర్ గా సమ్మయ్య బాధ్యతలు తీసుకున్న రోజు నుండి మున్సిపల్ అభివృద్ధి కోసం అన్ని వార్డుల్లో పారిశుధ్యం బాగు చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాడని అన్నారు. హుజురాబాద్ మునిసిపల్ చరిత్రలోనే అందరి ఉద్యోగుల, ప్రజల సహకారంతో 100 శాతం ఆస్తి పన్నును వసూలు చేసి రాష్ట్రంలో మున్సిపాలిటీకి ఖ్యాతి తీసుకొని వచ్చారని అన్నారు. హుజురాబాద్ ను పారిశుద్ధ్యంలో మంచి స్థానంలో నిలబెట్టడానికి స్వచ్ఛ హుజురాబాద్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరి సహకారంతో ఎగ్జిబిషన్ సైతం నిర్వహించి జిల్లా అధికారులచే శభాష్ అనిపించుకున్నారన్నారు. వేసవి సెలవుల్లో బాలలు, విద్యార్థులు, యువకులు, ఇతర వ్యాపకాలకు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు అందరి సహకారంతో వేసవి కాలంలో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని నెల రోజులపాటు నిర్వహించారని తెలిపారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపడుతూ అన్ని వార్డులను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొని కమిషనర్ ముందుకు వెళ్తున్న విషయం ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని పనుల్లో తాను కూడా భాగస్వామ్యం అవుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న కమిషనర్ సమ్మయ్య పై కావాలని రోడ్డ భరద్వాజ్ తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. డిజిటల్ కి ఎక్స్పైర్ కావడం వల్లనే కాంట్రాక్టు కేటాయింపులు ఆలస్యమైందని దీనిని అర్థం చేసుకోలేని వ్యక్తులు అనవసరంగా అసత్య ఆరోపణలు చేశారని అన్నారు. గతంలో భరద్వాజ్ కాంట్రాక్టర్ తనకు కేటాయించిన పనిలో కొంత భాగము పూర్తిచేసి మిగతాది వదిలివేశాడని అన్నారు. అభివృద్ధి చేస్తున్న వ్యక్తులపై నిందలు మోపడం సరికాదని వారు అన్నారు. మరోసారి కమిషనర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని దళిత, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు.

విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మారేపల్లి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కలవల మల్లయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కుమార్, కే సంపత్ కుమార్ లు