
–రైతుకు యూరియా బస్తాలు అందించని ప్రభుత్వానికి ఓట్లు అడిగే అర్హత లేదు
–ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిఆర్ఎస్ పార్టీ సిద్ధం
–జర్నలిస్టుల నివేషణ స్థలాలు అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. –హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాబోయే అన్ని ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో మరోసారి బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. మంగళవారం హుజురాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ 42 శాతాన్ని బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిపాదన పెట్టారని, బిసి రిజర్వేషన్‌కు తమ సంపూర్ణ మద్దతు కూడా ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థికి తాను పూర్తిస్థాయి అండగా ఉండి గెలిపించుకుంటానని అన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుజురాబాద్ లోని 107 గ్రామపంచాయతీలు రెండు మున్సిపాలిటీలను వందల కోట్లు వెచ్చించి అద్భుతంగా తీర్చిదిద్దారని, హుజురాబాద్ ప్రజలు చైతన్యవంతులని వారికి ఏ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగిందో తెలుసని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చిందని, ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైందని అన్నారు. కెసిఆర్ హయాంలో రైతులు చాల ఆనందంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను నడిరోడ్డుపై నిలబెట్టిందన్నారు. రైతులకు కనీసం యూరియా బస్తాలు అందించని ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కూడా లేదని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తారు చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన నియోజకవర్గానికి బాకీ ఉన్న మొత్తాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తామని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్న బాకీ కార్డును కూడా ప్రజలకు అందిస్తామన్నారు. హుజురాబాద్ జర్నలిస్టులకు ఇచ్చిన నివేషణ స్థలాలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని, జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అలాగే ఎన్నికల కోసం ముందస్తుగా ఈనెల 4వ తేదీన ఉదయం వీణవంక సాయంత్రం హుజురాబాద్ మండలాల నాయకులతో సమావేశం ఉంటుందని అన్నారు. అలాగే 5వ తేదీన ఉదయం ఇల్లంతకుంట సాయంత్రం జమ్మికుంట సమావేశం ఉంటుందని, ఆరవ తేదీన ఉదయం కమలాపూర్ మండల నాయకులతో సమావేశం ఉంటుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పి మాజీ చైర్ పర్సన్ కె విజయ, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..





