
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్ :మూడు రాష్ట్రాలను ముప్పు తిప్పలు పెట్టిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడకం హిడ్మా, అలియాస్ చైతు ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో పోలీసుల చేతికి హిడ్మా చిక్కినట్లు తెలుస్తోంది. ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో కాల్పులు జరిగాయి. అల్లూరి జిల్లా రంపచోడవరం వద్ద జరిగిన ఈ ఘటనలో హిడ్మా, ఆయన భార్యతో పాటు నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఇదిలావుండగా, పోలీసుల ఎన్కౌంటర్లో హిడ్మా చనీపోయాడంటూ గతంలోనూ అనేక వార్తలు వచ్చాయి. ఎన్ కౌంటర్ లో చనిపోయాడంటూ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే తాను బతికే ఉన్నానంటూ హిడ్మా పోలీసులకే సవాల్ విసురుతూ వచ్చాడు. 2023లో హిడ్మా ఎన్కౌంటర్లో హతమైనట్లు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. తాను చనిపోలేదని బతికే ఉన్నానని ఏకంగా హిడ్మానే ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఆయన ఎన్నో ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. దాదాపు పది ఎన్ కౌంటర్ల నుంచి తృటిలో తప్పించుకున్నారు. దండకారణ్యంలో అణువణువూ తెలిసి ఉన్న ఆయన ఎప్పటికప్పుడు పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకోవడంలో దిట్ట.
26 దాడులకు మాస్టర్ ప్లాన్
2004 నుంచి ఇప్పటివరకూ జరిగిన 26 దాడులకు హిడ్మా మాస్టర్ మైండ్ గా పనిచేశాడు. 200 మందికి పైగా భద్రతా బలగాల మరణాలకు అతడు కారణమయ్యాడు. ముఖ్యంగా 2021 బిజాపూర్ జరిగిన భారీ దాడి వెనుక హిడ్మా పాత్ర ఉంది. STF, DRG, CRPF బృందాలపై మావోలు జరిపిన మెరుపు దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో అప్పట్లో హిడ్మా పేరు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. దీంతో అతడ్ని పట్టుకునేందుకు దాదాపు 2000 మందితో కూడిన బృందాలను ఉన్నతాధికారులు రంగంలోకి దింపినట్లు సమాచారం. అటువంటి హిడ్మాను తాజాగా మట్టుబెట్టడం ద్వారా మావోయిస్టులపై పోలీసులు అతి భారీ విజయాన్ని సాధించారని చెప్పవచ్చు.
హిడ్మా ఎవరంటే?
హిడ్మా విషయానికి వస్తే.. ఆయన 1981లో చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పుర్వతి గ్రామంలో జన్మించారు. 10వ తరగతి వరకు చదువుకున్న తర్వాత 1990ల చివరలో మావోయిస్ట్ ఉద్యమంలో చేరాడు. తొలినాళ్లలో పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీ (PLGA) బటాలియన్ లో కమాండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సభ్యుడిగా, సెంట్రల్ కమిటీలో అతి పిన్ని సభ్యుడిగా పదవి పొందాడు. సుక్మా, బిజాపూర్, దంతేవాడ జిల్లాలలోని మావోయిస్ట్ కార్యకలాపాల్లో అతడు ముఖ్య భూమిక పోషించాడు.
ఏపీ డీజీపీ రియాక్షన్
మరోవైపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల గురించి ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పందించారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్లు తనకు సమాచారం ఉందని చెప్పారు. వారిలో హిడ్మా తో పాటు ఆయన భార్య కూడా మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఉదయం 6 – 7 గంటల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగతున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదలికలపై సమాచారమున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చెప్పుకొచ్చారు.
హిడ్మా మాత్రం మావోయిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే నిర్ణయించుకుని అడవుల్లోనే ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో హిడ్మాను లొంగిపోవాలని కోరుతూ ఇటీవల చత్తీస్గడ్ హోంమంత్రి స్వయంగా చత్తీస్‌గడ్‌లోని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కోరాడు. అయినా లొంగుబాటుకు సంబంధించి ఎలాంటి సానుకూల ప్రకటన ఆయన్ను రాలేదు. మరో వైపు హిడ్మాను అదుపులోకి తీసుకునేందుకు కూంబింగ్ బృందాలు ప్రయత్నాలను ముమ్మరం చేయగా ఎదురు కాల్పులు జరగడంతో…హిడ్మా ఎన్ కౌంటర్ కావడం తోపాటు ఆయన భార్య మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు ఎంతకు కోలుకొని దెబ్బ తగిలినట్లు అయింది.

ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా, అతని భార్య..


ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా అనుచరులు..







