
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (వీణవంక), మార్చ్ 16 :
వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల శ్రీరామ్‌కు కొంతకాలం క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స కోసం ఇప్పటికే దాదాపు రూ.12 లక్షల వరకు ఖర్చు కావడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సాధారణ పరిస్థితుల్లోనే జీవనం సాగించే ఈ కుటుంబానికి వైద్య ఖర్చులు భారంగా మారాయి.ఈ విషయం తెలుసుకున్న జమ్మికుంట మండలం కొరపెల్లి గ్రామానికి చెందిన ఇండియన్ ఆర్మీ జవాన్ గుండబోయిన రమేష్ యాదవ్ మానవత్వం చాటుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు స్వయంగా వారి ఇంటికి వెళ్లి, నేరెళ్ల శ్రీరామ్‌కు తన వంతుగా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీరామ్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని కోరారు.
రమేష్ యాదవ్ చూపిన మానవత్వానికి గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. కష్టసమయంలో సహాయం చేసి ఆర్మీ జవాన్ గొప్ప మనసు చూపారని ప్రశంసించారు.

నేరెళ్ల శ్రీరామ్‌కు తన వంతుగా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేస్తున్న రమేష్ యాదవ్..





