,మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈనెల 22వ తేదీ ఆదివారం హుజురాబాద్ విఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాట్లను నిరసిస్తూ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ…
హుజూరాబాద్ కు సమీపంలోని సిర్సపల్లి గ్రామ పరిధిలో ఏర్పాటు కానున్న డంపింగ్ యార్డ్ వల్ల ఏర్పడనున్న విషపూరితమైన కాలుష్యం వల్ల సిర్సపల్లి గ్రామం, హుజూరాబాద్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల ప్రజల జీవించే హక్కుకు ప్రమాదమేర్పడుతుందనీ అన్నారు. పశు, పక్షులకు మనుగడ లేకుండా పోతుందనీ, వ్యవసాయ ఉత్పత్తులు విషపూరితం కానున్నాయనీ తెలిపారు. రాబోయే కాలంలో వచ్చే ప్రమాదకర పరిస్థితిని మనందరం సంఘటితంగా అడ్డుకోకపోతే డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేస్తారనీ అన్నారు.
రాజకీయాలకతీతంగా ఏర్పాటు చేసే రౌండ్ టేబుల్ సమావేశానికి హుజురాబాద్ ప్రాంత అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, వ్యాపార, వాణిజ్య సంఘాలు, అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, విద్యార్థి సంఘాల బాధ్యులు హాజరుకావాలని కోరారు.




