
మండల యాదగిరి, స్వర్ణోదయం హుజూరాబాద్, మార్చి 31: హుజూరాబాద్ డివిజన్ పరిధిలో దొంగలు సరికొత్త వేషధారణలతో, వినూత్న రీతిలో దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. అమాయక ప్రజలను, ముఖ్యంగా గ్రామాల్లోని వృద్ధులను లక్ష్యంగా చేసుకుని పథకం ప్రకారం దోచుకుంటున్నారు. తాజాగా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలోనీ వివేకనంద వీధిలో చోటుచేసుకున్న ఒక వినూత్న చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అంతర్జాతీయంగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ కొరత ఉందనే సాకును దొంగలు తమకు అనుకూలంగా మార్చుకోవడం గమనార్హం.
కందుగుల గ్రామానికి చెందిన గుడిపాటి ఆగమ్మ అనే వృద్ధురాలిని దొంగలు అత్యంత తెలివిగా బురిడీ కొట్టించారు. ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆగమ్మ వద్దకు వచ్చి, “ప్రస్తుతం యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఉంది, కానీ నీ పేరు మీద ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ వచ్చింది. వెంటనే బస్టాండ్ వద్దకు వచ్చి సంతకం పెడితే సిలిండర్ ఇస్తారు” అని నమ్మబలికాడు. ఆ మాటలు నిజమేనని నమ్మిన ఆగమ్మ, సదరు వ్యక్తితో కలిసి బస్టాండ్ వరకు వెళ్ళింది. అయితే ఆమెను అక్కడ వదిలేసిన ఆ గుర్తుతెలియని వ్యక్తి, ఆమె కళ్ళు గప్పి వేగంగా వెనక్కి వచ్చి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. ఆగమ్మ బస్టాండ్ నుండి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి, ఇంట్లో భద్రపరిచిన మూడున్నర తులాల బంగారంతో పాటు నగదు మాయమైనట్లు గుర్తించి లబోదిబోమంది. ఈ ఘటనపై హుజూరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


తన బంగారు నగలు పోయినాయి అని చూపెడుతున్న బాధితురాలు..
రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు: నిందితుల కోసం ముమ్మర వేట.
వరుసగా జరుగుతున్న ఈ దొంగతనాలను అరికట్టడానికి మరియు నిందితులను త్వరగా పట్టుకోవడానికి పోలీసు యంత్రాంగం నాలుగు ప్రత్యేక బృందాలను (Special Teams) ఏర్పాటు చేసింది. ముఖ్యంగా శంకరపట్నం మండలం మెట్పల్లిలో జరిగిన దొంగతనం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. దొంగతనానికి పాల్పడిన దుండగులు కారులో జనగామ సమీపంలోని పాలకుర్తి వరకు వెళ్లినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. నిందితుల కదలికలపై నిఘా ఉంచామని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకొని సొత్తును రికవరీ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజలకు పలు కీలక సూచనలు జారీ చేశారు. బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో దొంగలు ప్రధానంగా వృద్ధులను, ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారని, అపరిచితులు చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధ్యతగా ‘100’ కు డయల్ చేయాలని కోరారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంబంధిత ప్రాంతానికి చేరుకొని తనిఖీలు చేపడతారని తెలిపారు. విలువైన బంగారు ఆభరణాలను ఇంట్లోని బీరువాల్లో ఉంచడం కంటే బ్యాంకుల్లో పెట్టుకోవడం సురక్షితమని, అత్యవసర పనులపై ఊరికి వెళ్లేటప్పుడు ఇళ్లకు తాళాలు వేసి ఆ సమాచారాన్ని సమీప పోలీస్ స్టేషన్లో ఇవ్వడం చాలా మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.

బాధితురాలు విచారిస్తున్న పోలీసులు..

బాధితురాలు ఇంటి వద్దకు పోయి విచారిస్తున్న ప్రజలు





