
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా జనావాసాల మధ్య నెలకొల్పే డంపింగ్ యార్డ్ ప్రాజెక్టు ను వెంటనే రద్దు చేయాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని, రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
గత పది రోజులుగా హుజురాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా అఖిల పక్ష వివిధ కుల ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు మద్దతుగా బుధవారం వేలాది మంది ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో అంబేద్కర్ కూడలి చౌరస్తాలో చుట్టూ అర కిలో మీటరుతో పాఠశాలల యాజమాన్యాల వారిచే మానవహారం నిర్వహించారు .
ఎలాంటి ప్రజాబిప్రాయ సేకరణ చేయకుండా జనావాసాల మధ్య ప్రాణ కోటికి, అన్నదాతల వ్యవసాయ రంగానికి జల వాయు కాలుష్యముతో నష్టం చేకూర్చే డంపింగ్ యార్డు ప్రాజెక్టు వెంటనే రద్దు చేయాలని పలువురు విద్యార్థినీ విద్యార్థులు డిమాండ్ చేస్తూ నిందించారు. రెండు గంటల సేపు వాహనాలు బారులు దీరి వాహనాల్లో వచ్చిన వారు సైతం ఈ ఆందోళనలకు మద్దతుగా సంఘీభావం తెలిపారు. మొత్తం మున్సిపల్ కౌన్సిలర్లు, సింగాపూర్, మాందాటిపేట్ గ్రామాల గ్రామ పంచాయతి సర్పంచ్, ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు మాజీ సర్పంచులు సింగిల్ మాజీ విండో చైర్మన్లు బుధవారం సింగిల్ విండో మాజీ చైర్మన్ గౌరు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ప్రజలు దీక్షా శిబిరంలో కూర్చొన్నారు.

చౌరస్తాలో మనవహారంగా ఏర్పడిన విద్యార్థులు..



ఈ సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ ఇట్టి డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును రద్దు చేసే వరకు అధికార పార్టీకే చెందిన తాము సైతం ఉద్యమంలో పాల్గొంటున్నామని, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా హుజురాబాద్ ప్రాంత సమీపంలో సిర్సపల్లి సరిహద్దు వద్ద జనావాసాల మధ్య నెలకొల్పే డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ తన అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించిందని తెలిపారు.
రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని మన్నించి తక్షణమే డంపింగ్ యార్డు ప్రాజెక్టును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పోలాడి రామారావు హెచ్చరించారు. గుట్టు చప్పుడు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య నెలకొల్పే డంపింగ్ యార్డ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉదృతంగ ఉద్యమం జరుగుతుంటే ప్రజాభీష్టానికి అనుగుణంగా పాలకులు తక్షణమే స్పందించి డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును రద్దు చేస్తూ అధికార ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు సైతం డంపింగ్ యార్డ్ ప్రాజెక్టు విషయంలో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి తప్పిదాలకు పాల్పడినారని అట్టి అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాము డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా కాదని జనావాసాల మధ్య కాకుండా ప్రజాభిప్రాయ సేకరణతో జనావాసాలకు దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

మాట్లాడుతున్న ఓసి జేఏసి జాతీయ అధ్యక్షుడు పోరాడి రామారావు..
రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన గ్రామ సభల్లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతి ల్లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయిస్తున్నామని అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని ఇప్పటికే పోస్టు కార్డుల ద్వారా సిఎం రేవంత్ కు ఉత్తరాలు రాసి పంపించామని ప్రభుత్వ స్పందన లేకుంటే అనేక రూపాల్లో మరింత ఉదృతంగా ఉద్యమిస్తామని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కలెక్టిరెట్ల ముట్టడించి నిరసనలు వ్యక్తం చేస్తామని పోలాడి రామారావు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు వర్థినేని రవీందర్ రావు, బండ సిందూజ, సర్పంచ్ పోల్సానీ రామారావు, ఉప సర్పంచ్ రాజేశ్వర్ రావు, సింగిల్ విండో చైర్మన్లు ఎడవెల్లి కొండాల్ రెడ్డి, గౌరు కరుణాకర్ రెడ్డి, రైతు ప్రజాసంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, నిర్వాహకులు పల్కల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, కట్కురి మల్లారెడ్డి, జయపాళ్ రెడ్డి, సమ్మయ్య, మూగల రాజిరెడ్డి, ముచ్చా సమ్మిరెడ్డి, విష్ణుదాస్ గోపాల్ రావు, మహిళా సంఘాల నేతలు, వివిధ పాఠశాలల యాజమాన్యాలు, నాయకులు, వివిధ కుల సంఘాల, రైతు ప్రజాసంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.





