
–రాజకీయాలకు అతీతంగా ఉద్యమిద్దాం..
–స్వయంగా ముఖ్యమంత్రే.. డంపింగ్ యార్డును ప్రతిపాదించారు
–3 న బంద్ విజయవంతం చేయండి
–ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ప్రకటనను వెంటనే వెనక్కు తీసుకోవాలి
–హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
–డంపింగ్ యార్డ్ ప్రతిపాదన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
–ప్రభుత్వ ఉత్తర్వులను చదివి వినిపించిన కౌశిక్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ఏప్రిల్ 2 : తాను బతికుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ యార్డ్ పెట్టనిచ్చే ప్రసక్తి లేదని, ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమని, ప్రభుత్వ వెంటనే డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, రాజకీయాలకు అతీతంగా డంపింగ్ యార్డ్ పై ఉద్యమించాలని, ఈ నెల మూడున జరిగే హుజురాబాద్ బంద్ విజయవంతం చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన సిర్సపల్లి సమీపంలోని డంపింగ్ యార్డ్ ప్రతిపాదిత స్థలాన్ని బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, ఇది ప్రజల జీవిత సమస్య అని, నిజంగానే ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటయితే ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుందని, రైతులు మహిళలు పిల్లలు ఇబ్బందులు పడతారని, పశుపక్షాదుల ఉనికి సైతం ప్రశ్నార్థకమవుతుందని పర్యావరణం దెబ్బతింటుందని, ప్రజలు ముక్తకంఠంతో డంపింగ్ యార్డ్ వద్దని కోరుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రికి డంపింగ్ యార్డ్ వద్దని, హుజురాబాద్ ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని దండం పెట్టి చెప్పానని ఆయన తెలిపారు. “నాపైకోపం ఉంటే నన్ను ఉరి తీయండి.. జైలుకు పంపండి.. కానీ నా నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెట్టద్దు.. హుజురాబాద్ గడ్డ పోరాటాల అడ్డ.. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో హుజురాబాద్ కమలాపూర్ ప్రాంతం కీలకపాత్ర పోషించింది.. ఈ ప్రాంతానికి పోరాటాలు కొత్త కాదు” అని ఆయన ఉద్వేగంగా అన్నారు. డంపింగ్ యార్డ్ వ్యవహారంలో ఎవరు బురద చల్లేందుకు ప్రయత్నించవద్దని, స్వయంగా ముఖ్యమంత్రి డంపింగ్ యార్డ్ ను ప్రతిపాదించారని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఆయన ఈ సందర్భంగా చదివి వినిపించారు. డంపింగ్ యార్డ్ రద్దు విషయంపై తాను ముఖ్యమంత్రికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లకు లేఖలు ఇప్పటికే రాసినట్టు ఆయన వివరించారు.


–7, 8 తేదీల్లో దీక్ష చేస్తా : కౌశిక్ రెడ్డి
డంపింగ్ యార్ హుజురాబాద్ ప్రజలందరి జీవన్మరణ సమస్య అని, ఒకవేళ ప్రభుత్వం ప్రకటనను వెనక్కి తీసుకోకపోతే, డంపింగ్ యార్డ్ ను రద్దు చేయకపోతే తాను ఈ నెల 7, 8 తేదీలలో స్వయంగా జేఏసీ శిబిరంలో దీక్షలో పాల్గొంటానని, 7న ఉదయం 7 గంటల నుండి 7 వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తానని అయన వెల్లడించారు. ఆ లోపే ప్రభుత్వం నుండి అనుకూలమైన ప్రకటన వస్తుందని ఆశిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

– 3న బంద్ విజయవంతం చేయండి
బందును అడ్డుకోవాలని పోలీసు అధికారులు ప్రయత్నం చేయవద్దని, పోలీసులు వందలాది మంది ఉంటే హుజురాబాద్ లో లక్ష మంది ప్రజలు ఉన్నారని, ప్రజా పోరాటాన్ని ఎవరు ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. హుజురాబాద్లో మూడో తేదీన బంద్ శాంతియుతంగా జరుగుతుందని బంద్ విషయాన్ని పోలీసు అధికారులతో కూడా చర్చించి సహకరించాలని కోరానని, డంపింగ్ యార్డ్ ఏర్పాటయితే పోలీసులకు కూడా ఇబ్బంది జరుగుతుందని ఆయన అన్నారు. బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి సిపిఐ సిపిఎంతో పాటు అన్ని పార్టీలు స్వచ్ఛంద సంస్థలు అన్ని వర్గాలు బందులో పాల్గొనాలని, ప్రజలు డంపింగ్ యార్డ్ అంశంపై సీరియస్ గా ఉన్నారన్న సంకేతం ప్రభుత్వానికి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. హుజురాబాద్ బంద్ విషయమై ఇప్పటికే వ్యాపార వర్గాలతో తాను చర్చించానని, అత్యవసర సేవలైన దవాఖానాలు మెడికల్ షాపులు తప్ప మిగతావి అన్ని బంద్ పాటించాలని, అందరూ రాజకీయాలకు అతీతంగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిజానికి నాలుగో తేదీన బంద్ పట్టిద్దామని అనుకున్నామని కానీ తనను సిఐడి విచారణకు హాజరుకావాలని చెప్పినందున చట్టాన్ని గౌరవించే ఉద్దేశంతో తాను మూడో తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సిరసపల్లి -హుజరాబాద్ వాసుల అభిప్రాయాలను సేకరిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
—టెండర్లు వేయొద్దు
డంపింగ్ యార్డ్ కం ఎనర్జీ ప్లాంట్ కాంట్రాక్ట్ పనులకు ఏవి కూడా టెండర్ వెయ్యోద్దని, వేస్తే తప్పకుండా అడ్డుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ జవహర్ నగర్ లోనూ ఇలాగే ప్లాంట్ పెడితే ప్రస్తుతం అక్కడ జనాలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని స్వయంగా అందరూ చూస్తున్నారని, ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చెప్పారని, అక్కడ ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితి ఉందని తెలిపారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..





