
కట్ చేస్తే ఆస్ట్రేలియా…!
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: వైజాగ్ అమ్మాయి.. తిమ్మాపూర్ అబ్బాయి.. అనుకోకుండా ఓ కాడ కలిశారు. అది కాస్త ప్రేమగా మారి చివరికి మరచిపోని గాయాన్ని మిగిలింది. ప్రేమించి కొన్ని రోజులు కలిసి జీవించి చివరకు డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చి ప్రేమించిన వ్యక్తిని మోసం చేసి, యువకుని వద్ద నుంచి రూ.16 లక్షలు దండుకొని ఓ యువతి ఆస్ట్రేలియా ఉడాయించిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో చోటుచేసుకుంది. బాధితుని తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు ఎల్ఎండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.. పోలీసుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాదన నాగరాజు యోగ నేర్చుకొనేందుకు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ కు వెళ్లాడు. అక్కడ వైజాగ్ కు చెందిన కమల సంధ్య ప్రియాంకతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా సహ జీవనానికి దారి తీసింది. కొద్ది నెలల క్రితం తిమ్మాపూర్ కు ఇరువురు రాగా నాగరాజు తండ్రి మల్లయ్య వారిని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో అదే గ్రామంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని కొన్నాళ్లు కాపురం చేశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నాగరాజు డబ్బులు పెట్టి పార్ట్నర్షిప్ ఉండగా దానిలో భాగస్వామ్యంను రద్దు చేసుకోగా అతనికి రూ.16 లక్షలు వచ్చాయి. ప్రియాంక ఆ డబ్బులను తన బంధువుకు అవసరం ఉన్నాయని మళ్లీ ఇస్తారని చెప్పి వారి అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేయించుకుంది. అనంతరం పని ఉందని ఆస్ట్రేలియాకు వెళ్లిన ప్రియాంక మళ్ళీ రూ.3 లక్షలు కావాలని డిమాండ్ చేసింది.. అంతటితో ఆగకుండా నాగరాజుకు రావాల్సిన వాటా భూమిని తన పేర చేయించుకుంటేనే పెళ్ళి చేసుకుంటానని షరతు విధించింది. దీంతో భూమిని రిజిస్టర్ చేయాలని నాగరాజు తమను వేదిస్తున్నాడని అతని తండ్రి మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రియాంక కూపిలాగడంతో అసలు విషయం వెలుగు చూసింది. ప్రియురాలు మోసం చేయడంతో మనస్థాపం చెందిన నాగరాజు
ఆత్మహత్యాయత్నం చేసుకోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని మల్లయ్య తెలిపారు. మల్లయ్య
ఫిర్యాదు మేరకు డబ్బులతో ఆస్ట్రేలియాకు ఉడాయించిన కమల సంధ్య ప్రియాంకపై కేసు నమోదు చేసి ఆమెను ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
