
- రైతులు పండించిన ప్రతి గింజను కొనాల్సిందే..!
- అన్ని రకాల ధాన్యానికి బోనస్ చెల్లించాలి
- ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్
- మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్:
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాల మోసం చేస్తూ ఆగం చేస్తుందని, రైతులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోమని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం హుజరాబాద్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు చిన్న ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అప్పుటి సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా ఆలోచిస్తూ సకాలంలోనే రైతులకు రైతుబంధు రైతుల ఖాతాలో జమ చేసే వారని, రైతులు పండించిన ప్రతి గింజను కొనేవారని అన్నారు. తడిసిన వడ్లను కూడా ప్రభుత్వానికి నష్టమైనప్పటికీ రైతులకు నష్టం కలగకుండా ఉండేందుకు వాటిని కొనేవారని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినా కూడా అధికారులు రైతుల వద్ద నుంచి తడిసిన ధాన్యం కొనకపోయేసరికి ఆవేదనతో రైతులు పంటను కూడా అక్కడే తగలబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. రైతులకు రూ .500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రస్తుతం సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పడం సరైనది కాదని, ఏ రకమైన వడ్లకైనా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న రైతులకు రైతుబంధు రూ .15,000 ఇస్తామని చెప్పి రేవంత్ ప్రభుత్వం మాట తప్పిందని, దీంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డిసెంబర్ 9న రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు దాని ఊసు కూడా ఎత్తడం లేదని అన్నారు. రైతులకు 24 గంటల కరెంటుతో పాటు రైతుబంధు, రుణమాఫీ అమలు చేయాలని, వీటితో పాటు రైతులు పండించిన పంటలను మొత్తాన్ని ప్రభుత్వం కొనాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, బిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు సంగెం ఐలయ్య, కౌన్సిలర్లు కల్లెపల్లి రమ,కేసిరెడ్డి లావణ్య, మెరుగు కొండల్ రెడ్డి, ముక్క రమేష్, మాజీ సర్పంచులు, నాయకులు బత్తుల సమ్మయ్య, శ్రీనివాస్, సదానందం, భాస్కర్ చారి, మోరె మధులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
