
-ప్రజా సంఘాల నాయకుల డిమాండ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
పీడిత ప్రజలకు చెందిన సహజ సంపదను కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు మోడీ-అమిత్ షాల నాయకత్వలోని ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసీ ప్రజలపై కొనసాగిస్తున్న యుద్దాన్ని తక్షణం నిలిపివేయాలని హుజురాబాద్ ప్రాంతంలోని ప్రజా సంఘాలు, భారత్ బచావో, ప్రజాస్వామిక హక్కుల సంఘాలు, సాహిత్య సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
భారత్ బచావో సంస్థకు చెందిన భీమోజు సదానందం, పొడిశెట్టి వెంకటరాజం, మాదిగ మేధావుల ఫోరం నాయకులు వేల్పుల రత్నం, మొగిలయ్య, జనసాహితి సాహిత్య సంస్థ కన్వీనర్ ఆవునూరి సమ్మయ్య, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, మార్త రవీందర్ లు శనివారం ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేసారు. ఆపరేషన్ కగార్ పేరిట భారత సైన్యం ఆదివాసీ ప్రజలపైన, మావోయిస్టు పార్టీ కార్యకర్తలపైన అమానవీయంగా దాడులు జరువుతూ ఎంకౌంటర్ల పేరుతో అమాయక ఆదివాసీ ప్రజలను హత్యాకాండకు గురిచేస్తున్నారని వారు తమ ప్రకటనలో ఆరోపించారు. కార్పోరేట్ కంపెనీల మెప్పు కోసం పాలకులు సైన్యం ద్వారా తమ స్వంత ప్రజాలపైనే యుద్దాన్ని కోసాగించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఆదివాసీ ప్రజల సమస్యల పరిష్కారానికి పని చేయవలసిన ప్రభుత్వాలు అమాయక ప్రజలపై సైన్యాన్ని ఉసిగొల్పడం అప్రజాస్వామికమని, మధ్య భారతంలోని అటవీ ప్రాంతాల నుండి తక్షణమే సైన్యాన్ని ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు. ఆదివాసీ ప్రజలపై పాలకులు కొనసాగిస్తున్న మారణకాండపై సత్వరమే న్యాయ విచారణ జరపాలని వారు విజ్ఞప్తి చేశారు.