
- బీసీఐ సమన్వయకర్త రజిత
హుజురాబాద్ మండలము ధర్మరాజుపల్లి గ్రామంలో శనివారం రైతులకు డబ్ల్యూ డబ్ల్యూఎఫ్ నవ క్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ వారి బిసిఐ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గ్రామ రైతులకు వేసవిలో చేసే పనులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీఐ సమన్వయకర్త రజిత మాట్లాడుతూ రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటించి పంటల సాగు చేయడం ద్వారా రైతులకు పెట్టుబడి తగ్గి నేల కాలుష్యం తగ్గుతుందన్నారు. రైతులు వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలనీ, పశువుల పెంటలు, చెరువు మట్టి వేసుకోవాలని, గొర్ల మందలు పెట్టించు కోవాలని, పచ్చిరొట్ట ఎరువులు జీలుగ, జనుము, పిల్లిపెసర, నవధాన్యాలు మొదలగునవి చల్లుకొని పూత దశలో వాటిని కలియ దున్నుకోవాలన్నారు, పత్తి, మొక్కజొన్న వ్యర్థాలను కలియదున్నడం వలన జీవన ఎరువులు, వర్మీకంపోస్ట్, వెస్ట్ డికంపోజర్ వాడడం వల్ల భూసారం పెరుగుతుందని తెలిపారు. వివిధ పంటలల్లో ఎండు తెగులు నివారణకు ట్రైకో డెర్మావిరిడీని పశువులపెంటలో కలుపుకొని తేమ ఉన్నప్పుడు భూమిలో చల్లుకొని కలియ దున్నుకోవాలన్నారు. భూసార పరీక్షల కొరకు రైతులు తీసుకవచ్చిన మట్టిని రైతుల సమక్షంలో పరీక్షలు చేసి రైతులందరికి పరీక్షల ఫలితాలు వెంటనే ఇచ్చి అన్ని వివరాలు చెప్పారు. పైన చెప్పిన అన్ని విషయాలను తప్పక ఆచరిస్తూ తమ ఆరోగ్యంతో పాటు పర్యావరణం కాపాడాలని రైతులకు సూచించారు.