Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : హుజూరాబాద్ మండలం జూపాక గ్రామంలో అక్టోబర్ 30న నిర్వహించాల్సిన “సివిల్ రైట్స్ డే” (పౌర హక్కుల అవగాహన కార్యక్రమం)ను రద్దు చేసిన అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ‘తెలంగాణ అంబేద్కర్ సంఘం’ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, న్యాయం మరియు వివక్షకు వ్యతిరేకంగా రక్షణ వంటి ప్రాథమిక హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మండల అధికారులపై ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 15 (వివక్ష నిషేధం), ఆర్టికల్ 17 (అంటరానితనం నిర్మూలన), ఆర్టికల్ 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ) గురించి గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేయాల్సిన ప్రాముఖ్యమైన కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేయడం విచారకరమని, తీవ్ర బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, ‘ప్రజావాణి’లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు సమర్పించినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని, పరిష్కార మార్గం చూపడం లేదని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన మండల అధికారులపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి తునికి సమ్మయ్య, వేల్పుల ప్రభాకర్ సామాజిక ఉద్యమ నేత, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.





