
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకొని, ఇప్పుడు దాని ఊసే ఎత్తకుండా తెలంగాణ యువతను నిండా ముంచిందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ విమర్శించారు.
కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో యువ నాయకుడు రాగడి సందీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శనగొండ పవన్ కృష్ణ, దావరి కార్తీక్, జెరిపోతుల నవీన్, మహమ్మద్ అఫ్రోజ్లతో పాటు పలువురు యువకులు పార్టీలో చేరారు. వారికి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ గులాబీ కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ… పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ నాయకత్వంపై, ఆమె చేస్తున్న ప్రజా పోరాటాలపై నమ్మకంతోనే రోజురోజుకూ తెలంగాణ రక్షణ సేనలోకి యువత చేరికలు పెరుగుతున్నాయని అన్నారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో యువత పాత్ర కీలకమని, రాష్ట్రంలో రైతులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై టీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. కవితమ్మ ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, గౌరవం ఉంటాయని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ అంకం శివరాణి, నగర అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మడిపల్లి వినీత్, జిల్లా నాయకులు గర్షకుర్తి విద్యాసాగర్, గుంజపడుగు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.





