
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్ (వర్గల్): చదువుకుని ఉన్నత స్థాయికి ఎదుగుతాడనుకున్న కుమారుడు, టీచర్ కొట్టాడనే మనస్తాపంతో అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. హోంవర్క్ చేయలేదన్న చిన్న కారణంతో ఉపాధ్యాయుడు సరిగ్గా మందలించకపోవడం, ఆ దండనను తట్టుకోలేక 10వ తరగతి విద్యార్థి ప్రాణాలు తీసుకున్న విషాద సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
స్థానికులు, బాధితుడి వివరాల ప్రకారం.. మార్కుక్ మండలం పోతూర్ గ్రామానికి చెందిన రామ్ చరణ్ (15) వర్గల్ మండల కేంద్రంలోని బీసీ గురుకుల వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్లో హోంవర్క్ చేయలేదనే కారణంతో ఉపాధ్యాయుడు రామ్ చరణ్‌ను తీవ్రంగా కొట్టాడు.
టీచర్ దండించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామ్ చరణ్, తన తండ్రికి ఫోన్ చేసి “నా వల్ల కావడం లేదు నాన్నా.. టీచర్ కొట్టాడు, నేను ఇక్కడ హాస్టల్లో ఉండలేను” అని ఆవేదనతో తెలిపాడు. తండ్రి ఓదార్చే లోపే, హాస్టల్లో తోటి విద్యార్థులు ఎవరూ లేని సమయం చూసి బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే స్పందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు ఇక లేడని తెలిసి రామ్ చరణ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థి మృతితో పోతూర్ గ్రామంలోను, బీసీ వసతి గృహంలోను తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ దామెర అనూష- అనురాగ్ గారు, 20వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్, బిజెపి సీనియర్ నాయకులు హుజురాబాద్.





