
—సామాజిక ఉద్యమ నేత వేల్పుల ప్రభాకర్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించేలా వరంగల్ కరీంనగర్ మధ్య నడిచే ప్రతి ఆర్టీసీ బస్సును హుజురాబాద్ బస్టాండ్‌లో ఆపాలని సామాజిక ఉద్యమ నేత, విశ్రాంత ఆర్టీసీ కార్మిక సంఘాల నేత వేల్పుల ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్ డిప్యూటీ ఆర్ఎం భూపతిరెడ్డి, హుజురాబాద్ డీఎం దయాకర్ లకు ఆయన వినతిపత్రం అందజేశారు. నాన్‌స్టాప్, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు హుజురాబాద్ మీదుగా వెళ్లకుండా పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి ప్రతి బస్సు హుజురాబాద్ బస్టాండ్ కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హుజురాబాద్ ప్రాంత ప్రయాణికులకు సంబంధించిన ఈ ముఖ్య విషయాన్ని, సమస్యను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కరీంనగర్ వరంగల్ మధ్య ఉన్న హుజురాబాద్ వ్యాపార కేంద్రమని, 8 మండలాలకు హుజురాబాద్ కేంద్రంగా ఉందని, వేలాదిమంది ప్రయాణికులు హుజురాబాద్ మీదుగా ప్రయాణం చేస్తారని, ఇక్కడినుండి అన్ని రూట్లలో ప్రయాణికులు వెళ్తారని గుర్తు చేశారు. ఇటీవల కొన్ని బస్సులు కరీంనగర్ – వరంగల్ మధ్య నాన్ స్టాప్ గా వేశారని వాటిని సింగిల్ స్టాప్ గా మార్చాలని, హుజురాబాద్ లో స్టాప్ ఇవ్వాలని ఆయన కోరారు. జిల్లా ఏర్పాటు విషయంలో హుజురాబాద్ కు అన్యాయం జరిగిందని, కానీ బస్సుల విషయంలోనూ అన్యాయం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. హైవే రోడ్డు పేరుతో హుజురాబాద్ పై వివక్ష చూపడం తగదని ఆయన అన్నారు. ఈ విషయంలో ఆర్టీసీ స్పందించకపోతే పెద్ద ఎత్తున ప్రయాణికులతో కలిసి ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోర సతీష్, బి. కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ దామెర అనూష- అనురాగ్ గారు, 20వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్, బిజెపి సీనియర్ నాయకులు హుజురాబాద్.





