
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని
జమ్మికుంట రోడ్డులో గల నవగ్రహ సహిత శ్రీ సంతోషి మాత పరివార దేవత సహిత శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల దీక్షను పురస్కరించుకొని మహా పడిపూజ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, కన్నులపండువగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ కొత్త అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుకకు పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుండి అయ్యప్ప మాలధారులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా గణపతి హోమంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు ఎస్ కిరణ్ కుమార ఆచార్యులు, సుజిత్ శ్రీమాన్ ఆచార్యులు, మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, గణపతి హోమం, అభిషేకాలు మరియు వివిధ ప్రత్యేక పూజలు జరిపారు. సర్వాంగ సుందరంగా, వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన పద్దెనిమిది మెట్లకు (పడికి) జ్యోతి ప్రజ్వలన చేసి మహా పడిపూజను కనులవిందుగా నిర్వహించారు.




భక్తులందరూ ఏకకంఠంతో చేసిన “స్వామియే శరణం అయ్యప్ప” శరణుఘోషలతో భజనలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.


అనంతరం మాలధారులకు, భక్తులకు రాత్రి (అల్పాహారం) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గురుస్వాములు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.




