
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు వెలుపడ్డాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అత్యధిక ఓట్లు రాగా ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి గెలిచింది విధితమే. అయితే అదే ఊపు అనతి కాలంలోనే కోల్పోవడం, పార్లమెంటు ఎన్నికల్లో మూడవ స్థానానికి పడిపోవడం పలువురిని ఆలోచింపజేస్తుంది. నియోజకవర్గంలో పోలైన ఓట్లు 1,84,170 కాగా ఇందులో కాంగ్రెస్ 50,306, బీజేపీకి 73,280, బిఆర్ఎస్ కు 47,379 ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డికి మెజార్టీ ఓట్లు పడగా ఆ ఎన్నికలు జరిగిన నాలుగు నెలలకే ఆ ఓటు బ్యాంకు కాస్త కరిగిపోవడానికి కారణమేమిటో ఎవరికి అంతు చిక్కడం లేదు. గత ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైన బిజెపి.. పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి స్థానానికి చేరుకోవడం మూడవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ రెండవ స్థానానికి చేరుకోవడం, మొదటి స్థానంలో ఉన్న బిఆర్ఎస్ మూడో స్థానానికి చేరుకోవడం పలువురుని విస్మయానికి గురిచేస్తుంది. ప్రతి రౌండ్ లో ఆధిపత్యం కనబరిచిన బిజెపి చివరి 22వ రౌండ్ ముగిసే వరకు 22,974 లీడ్ లో వుండడం బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు అంతు చిక్కడం లేదు. దీనంతటికీ కారణం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీకి పెద్దదిక్కు అయిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారణమంటూ పలువురు బాహటంగా విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఓట్లు రాగా పార్లమెంట్ ఎన్నికల్లో 4 నెలలకే మెజార్టీ ఓట్లు తగ్గడానికి కారణం ఇక్కడి నాయకుల, కార్యకర్తల తీరేనని పలువురు బాహటంగా విమర్శిస్తున్నారు. ఏదిఏమైనాప్పటికీ హుజురాబాద్ నియోజకవర్గంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల కన్నా పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకొని ఓటు బ్యాంకును పెంచుకోవడం శుభపరిణామం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన దూకుడు తనాన్ని తగ్గించుకుని నాయకులు కార్యకర్తలను కలుపుకుపోయి ప్రజలతో మమేకమై పనిచేస్తే తప్ప భవిష్యత్తులో ప్రజల మద్దతు ఉండదని పలువురు భావిస్తున్నారు.

