మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో బాలికల వసతి గృహం ఎదుట ఇటీవల నిర్మించేందుకు ప్రయత్నించగా వివాదాస్పద మైంది. ఆ నిర్మాణాలను సోమవారం మున్సిపల్ అధికారులు జెసిబి తో తొలగించారు. హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు ప్రభుత్వ బాలికల పాఠశాల, ఎఎస్ డబ్ల్యూవో కార్యాలయాల ముందు రోడ్డుపై వాహనదారులకు ఇబ్బందికరంగా 10 షట్టర్ల నిర్మాణంకు కొంతమంది మున్సిపల్ పాలకవర్గ సభ్యులు పూనుకున్నారు. ఈ నిర్మాణాల విషయంపై వివిధ పార్టీల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన పెడచెవిన పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే మున్సిపల్ కమిషనర్ ఎందుకు ఆపడం లేదని బిజెపి నాయకుడు బింగి కరుణాకర్, కాంగ్రెస్ నాయకుడు నేరెళ్ల మహేందర్ గౌడ్ లు కలెక్టర్ కు, కమిషనర్ కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో కొన్ని రోజులపాటు అనుమతి లేకుండా నిర్మాణాలను ఆపివేయాలని జిల్లా కలెక్టర్ కమిషనర్ ను ఆదేశించడంతో నిర్మాణాలు ఆగిపోయాయి. కొ న్నాల తర్వాత తిరిగి నిర్మాణాలు చేస్తుండడంతో పలు ప్రజా సంఘాలు, బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో ఆగిపోయాయి. ఈ నిర్మాణాలు తమకు ఇబ్బంది కలిగిస్తాయని 2023 సెప్టెంబర్ లో హాస్టల్ వార్డెన్లు సైతం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ వాటిని తొలగించకుండా మున్సిపల్ అధికారులు ప్రేక్షక పాత్ర వహించారు. కాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరెళ్ల మహేందర్ గౌడ్ ఇటీవల కలెక్టర్ దృష్టికి, మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి మరొకసారి తీసుకెళ్లగా మంత్రి పొన్నం ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ సోమవారం జెసిబితో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.
-అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటాం..!
గత ప్రభుత్వ హయాంలో హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలలో బిఆర్ఎస్ నాయకులు నిర్మించిన అక్రమ కట్టడాలను అడ్డుకుంటామని, వెంటనే మున్సిపల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఏ నిర్మాణం జరిగినా వాటిని తొలగించాలని మాజీ సర్పంచులు నేరెళ్ల మహేందర్ గౌడ్, బింగి కరుణాకర్, కాంగ్రెస్ నాయకులు కొలిపాక శంకర్, ఎండి ఇమ్రాన్, పాపయ్యపల్లి కి చెందిన నరేడ్ల వినోద్ రెడ్డి, ఇప్పలపల్లి చంద్రశేఖర్ తదితరులు పేర్కొన్నారు.