మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భ్రూణ హత్యలను ప్రోత్సహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేయాలని, వాటికి సహకరిస్తున్న డాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని యువజన కాంగ్రెస్ నాయకుడు టేకుల శ్రావణ్ జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ చందుకు ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో విచ్చలవిడిగా ఆసుపత్రులు వెలిసాయని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ఒక్క హాస్పటల్ లేదని పేదప్రజల ఆరోగ్యాన్ని ఆసరాగా చేసుకుని వేలాది రూపాయలు దండుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు టేకుల శ్రావణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ…హుజురాబాద్, జమ్మికుంట కేంద్రాలుగా భ్రూణ హత్యలు పెరిగాయని జిల్లా వైద్య శాఖ అధికారులు వాటిని అరికట్టడంలో చూసిచూడనట్లుగా వ్యవహరించడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు. హుజురాబాద్, జమ్మికుంటలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఏర్పాటు చేసుకున్న ల్యాబ్ లో అనేక తప్పుడు వ్యవహారాలు దాగి ఉన్నాయని అట్టి ల్యాబుల్లో పనిచేసే సిబ్బంది ద్వారానే చీకటి వ్యాపారాలు నడుస్తున్నాయని అనుభవం లేని ల్యాబ్ టెక్నీషియన్లు హాస్పటల్ యాజమానుల కనుసన్నల్లో పనిచేస్తూ పేద ప్రజల రక్తాన్ని డబ్బు రూపాల్లో తగేస్తున్నారని అన్నారు. గతంలో బ్రుణ హత్యలు నిర్వహించిన ఆసుపత్రులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా జిల్లా అధికారులు మెడికల్ షాప్ ల దోపిడీని అరికట్టాలని, పేద ప్రజల ఆరోగ్యాన్ని ఆసరాగా చేసుకునే హాస్పటల్ల పై చర్యలు తీసుకోవాలని, వచ్చే వర్షాకాల సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు జంగ అనిల్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, చల్లూరి విష్ణువర్ధన్, బీట్ల సాయి తేజ, కొండ్ర నాగరాజు, బాలు తదితరులు పాల్గొన్నారు.
- Home
- ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు చేపట్టాలి..భ్రూణ హత్యలను అరికట్టాలి…యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్.